తెలంగాణలో సరికొత్త ‘మీ టికెట్’ యాప్‌… ఇక అన్నీ ఒకేచోటే!

Telangana Launches ‘Mee Ticket’ App to Book RTC, Metro, Temple and Tourist Tickets in One Place

ప్రయాణం చేయాలంటే ఒక యాప్‌, దర్శనం టికెట్ కోసం మరో వెబ్‌సైట్‌, పర్యాటక ప్రాంతాల కోసం ఇంకో ప్లాట్‌ఫామ్‌… ఇలా ఒక్కో పనికి ఒక్కో యాప్‌ ఓపెన్ చేయడం చాలా మందికి ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా పండుగల సీజన్‌లో లేదా సెలవుల్లో ప్రయాణాలు ప్లాన్ చేసేటప్పుడు ఇది మరింత సమయం తీసుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అన్ని రకాల టికెట్లను ఒకే చోట బుక్ చేసుకునేలా ‘మీ టికెట్’ అనే యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీస్ డెలివరీ (TESD) ఈ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఇకపై ఆర్టీసీ బస్సు టికెట్లు, హైదరాబాద్ మెట్రో టికెట్లు మాత్రమే కాకుండా… రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఎంట్రీ టికెట్లు, ఆలయాల దర్శనం టికెట్లను కూడా సులువుగా బుక్ చేసుకోవచ్చు.

ఇప్పటికే ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నా, చాలామందికి ఇంకా దీనిపై పూర్తి అవగాహన లేదు. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఊరికి వెళ్లేవారికి, పర్యటనలకు ప్లాన్ చేసుకునేవారికి ఈ యాప్ చాలా ఉపయోగపడనుంది. ఒకే యాప్‌లో అన్ని సేవలు ఉండటంతో సమయం ఆదా కావడమే కాకుండా, టికెట్ల కోసం లైన్లలో నిలబడే అవసరం కూడా ఉండదు.

‘మీ టికెట్’ యాప్‌ను ఉపయోగించడం కూడా చాలా సులువు. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘Mee Ticket’ అని సెర్చ్ చేసి, తెలంగాణ ప్రభుత్వ లోగోతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆర్టీసీ, మెట్రో, దేవాలయాలు, సందర్శన ప్రదేశాలు వంటి విభాగాలు కనిపిస్తాయి. అవసరమైన సేవను ఎంచుకుని టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

పేమెంట్ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే సురక్షితంగా చేయవచ్చు. టికెట్ బుక్ అయిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ టికెట్ యాప్‌లోనే లభిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ను చూపించి టికెట్ ధృవీకరణ చేసుకోవచ్చు. ఒకే యాప్‌లో అన్ని అవసరాలు తీర్చేలా రూపొందించిన ‘మీ టికెట్’ యాప్‌ ప్రజలకు మరింత సౌకర్యంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *