దళపతి విజయ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపైకి తిరిగిరావడానికి సిద్ధమైన సినిమా ‘జన నాయకన్’. ఈ చిత్రం మొదటగా జనవరి 9న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడంతో సినిమా విడుదలను మరో తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు రాజకీయ చర్చలకు కూడా దారితీస్తోంది.
సినిమా విడుదల ఆలస్యం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని విజయ్ అభిమానులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈ సినిమాపై ఒత్తిడి తెస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, దళపతి విజయ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ విషయంలో తమిళనాడుకు చెందిన ఒక కాంగ్రెస్ సీనియర్ నేత స్పందిస్తూ, నటుడు విజయ్ సినిమా ‘జన నాయకన్’ చుట్టూ నెలకొన్న వివాదం రాజకీయ అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆందోళనలకు దారితీస్తోందని వ్యాఖ్యానించారు. రాజకీయ విభేదాలు సహజమే అయినా, ఒక కళాకారుడి సృజనాత్మక కృషిని లక్ష్యంగా చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని ఆయన స్పష్టం చేశారు.

“రాజకీయ లాభాల కోసం సినిమాలపై సెన్సార్ విధించడం తమిళనాడు ప్రజలు అస్సలు సహించరు. కళను, వినోదాన్ని రాజకీయ యుద్ధాలకు పావులుగా ఉపయోగించకూడదు. అధికారులపై మీరు తెచ్చే ఒత్తిడివల్లే విజయ్ సినిమా ఆలస్యం అవుతోంది. ఇది నిర్మాతలకు, అభిమానులకు తీవ్ర అన్యాయం. రాజకీయాలను కళకు దూరంగా ఉంచి, సృజనాత్మక స్వేచ్ఛను గౌరవించాలి” అని ఆ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇదే సమయంలో, కరూర్ ఘటన సందర్భంగా దళపతి విజయ్‌కు మొదట మద్దతుగా నిలిచింది రాహుల్ గాంధీనే అని TVK నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు ‘జన నాయకన్’ అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, TVK – కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న సన్నిహితతకు స్పష్టమైన సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొత్తానికి, ఒక సినిమా విడుదల ఆలస్యం ఇప్పుడు కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా… తమిళనాడు రాజకీయాల్లోనూ కీలక అంశంగా మారింది. ‘జన నాయకన్’ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు, రాబోయే రోజుల్లో దళపతి విజయ్ రాజకీయ ప్రయాణంపై కూడా కొత్త చర్చలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పొచ్చు.