ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం,ఇలవేల్పు ,విజయనగరం ఆడపడుచుశ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి సిరిమాను జాతర విజయవంతంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా పోలీసు అధికారి ఎ.ఆర్. దామోదర్ లు సూచించారు.ఈ మేరకు మంగళవారం ఉదయం ఆరుగంటలకే కలెక్టర్, ఎస్పీలు స్వయంగా సిరిమాను తిరిగే ప్రదేశాలైన హుకుంపేట,మూడులాంతర్లు,కోట మార్గాలను మోర్నింగ్ వాక్ చేసుకుంటూ ప భక్తుల రాకపోక మార్గాలు, వాహన పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ పైడితల్లమ్మ జాతర ఉత్సవం ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమని, లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా చూడడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పార్కింగ్, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్యశిబిరాలు వంటి అన్ని సౌకర్యాలు సమగ్రంగా అందుబాటులో ఉండాలన్నారు.అలాగే, జాతర ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ – సిరిమాను జాతరలో భక్తుల రక్షణ కోసం సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ వ్యవస్థ, మహిళల భద్రత, రాత్రి పహారా వంటి చర్యలను కఠినంగా అమలు చేస్తామని, భక్తులు శాంతి భద్రతా నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. సిరిమాను జాతర ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ అధికారులు ఈ ఉత్సవం ఉత్తరాంధ్రలో ఏకత్వానికి ప్రతీకగా, భక్తుల విశ్వాసం నిలబెట్టే విధంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తుందని అన్నారు.
ముందుగా అమ్మవారి క్యూ లైనులను, సిరిమాను తిరిగే అమ్మవారి గుడి నుండి కోట వరకు పరిశీలించారు. అదేవిధంగా ప్రసాదల పంపిణీ, మీడియా పాయింట్ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పూజారి ఇంటి వద్ద చేపట్టానున్న సిరిమాను తయారీ, అక్కడి నుంచి గుడి వరకు సిరిమాను తరలించే విధానం తెలుసుకుని ఆ మార్గమంతా పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆర్‌డిఓ కీర్తి, ఏసీపీ సౌమ్య లత, దేవాదాయ శాఖ ఎ సి శిరీష, మున్సిపల్ కమిషనర్ నల్లన్నయ్య, తహసీల్దారు కుర్మనాథ్, పూజారి బంటుపల్లి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.