అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయాలు భారత్ రైస్ ఎగుమతులపై పెద్ద ప్రభావం చూపే అవకాశాన్ని కలిగించాయి. ఇటీవల వైట్ హౌస్‌లో అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో, మెరీల్ కెనడీ దక్షిణ అమెరికా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆమె భారతదేశం, థాయిలాండ్, చైనా నుండి పెద్ద ఎత్తున బియ్యం దిగుమతులు అవుతున్నందున అమెరికన్ మార్కెట్‌లో స్థానిక రైతులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పింది. దీనిపై ట్రంప్, “ఇలాంటి దేశాలపై సుంకాలు విధిస్తే సమస్య తక్షణమే పరిష్కారం అవుతుంది” అని వ్యాఖ్యానించారు.
భారతదేశం నుండి ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అమెరికాకు ఎగుమతి అవుతుంది. దీని విలువ సుమారు 3000 కోట్ల రూపాయలు. బాస్మతి బియ్యం ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తుంది, నాన్ బాస్మతి రైస్‌లో సొనామసూరి బియ్యం ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఎగుమతి అవుతుంది. నాన్ బాస్మతి రైస్‌కి ఇప్పటికే 15% సుంకాలు ఉన్నాయి. ట్రంప్ సర్కార్ కొత్తగా సుంకాలను 25%–40% వరకు పెంచితే, తెలుగు రాష్ట్రాల రైస్ ఎగుమతిదారులకు భారీ నష్టం వస్తుంది. అమెరికా మార్కెట్‌లో రైస్ ధర పెరగడంతో, ప్రవాస భారతీయులు తక్కువ ధరలో తలిచే స్థానిక లేదా థాయిలాండ్ బియ్యం కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. దీంతో, రైస్ ఎగుమతిదారులు లాభాలు కోల్పోవడం, ఇతర అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించడం తప్పనిసరి అవుతుంది. యూరప్, ఆఫ్రికా లాంటి కొత్త మార్కెట్లలో డిమాండ్ పరిశీలన చేయకపోతే, తెలుగు రాష్ట్రాలకు చెందిన రైస్ ఇండస్ట్రీ తీవ్ర ప్రభావానికి గురవుతుంది.