అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏవిషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈరోజు మిత్రుడు అన్ననోటే… ఆయన్ను శతృవుగా సృష్టిస్తున్నాడు. తాను శాంతి ఒప్పందం చేసి అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరమైన పాలనను తీసుకొచ్చేందుకు కృషి చేశానని చెప్పి 20 ఏళ్లపాటు ఆ దేశంలో గస్తీగా ఉన్న అమెరికా సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకున్నాడు. కోట్లాది డాలర్ల విలువైన విమానాలు, హెలికాఫ్టర్లు, వాహనాలు, ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అమెరికా వ్యూహాత్మకంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న ఎయిర్‌బేస్‌లను కూడా ఖాళీ చేశారు. ఇప్పుడు వాటిని తాలిబన్లు తమ సొంతం చేసుకొని, తమకు తెలిసిన రీతిలో వాడుకుంటున్నాయి.
ఇప్పుడిప్పుడే తాలిబన్లు ఆ దేశంలో సుస్థిరమైన పాలనను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థగా ఆవిర్భవించిన తాలిబన్లు అధికారం చేజిక్కించుకునే వరకు చేసిన పోరాటం ఒకెత్తైతే ఇప్పుడు అదే తాలిబన్లు నమ్మకమైన పాలన అందిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 20వ తేదీన ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా డెవలప్ చేసిన బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి అప్పగించాలని, లేని పక్షంలో BAD THINGS ARE GOING TO HAPPEN అంటూ పోస్ట్ చేశారు. హెచ్చరింపుగా చేసిన ఈ వ్యాఖ్యలపై తాలిబన్లు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
ట్రంప్ డిమాండ్‌ను ససేమిరా ఒప్పుకోబోమని, తమకు చెందిన ఏ భూభాగాన్ని తాము వదులుకోమని, అమెరికా మళ్లీ యుద్ధానికి వస్తే మరో 20 ఏళ్లపాటు పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని తాలిబన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ, రక్షణ మంత్రి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్‌లతో పాటు పలువురు తాలిబన్ నేతలు హెచ్చరించారు. తమకు పోరాటాలు కొత్తేమి కాదని, ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తేనే నేడు అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి వచ్చామని, అమెరికా తొత్తులను తాము ఇక్కడ అధికారంలో ఉండనివ్వబోమని స్పష్టం చేశారు.
అసలు ఈ ఎయిర్ బేస్‌పై అమెరికా మరలా ఎందుకు దృష్టిపెట్టింది అనే కోణంలో విశ్లేషిస్తే కనుక… 2021లో అమెరికా ఈ ఎయిర్‌బేస్‌ను పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయింది. 2020లో ట్రంప్ దోహాలో ఒప్పందం చేయడంతోనే ఈ నిష్క్రమణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ జోలికి ఎవరూ వెళ్లలేదు. ఆ దేశం కూడా ఎవరితోనూ గొడవకు దిగలేదు. కానీ, ఇప్పుడు హటాత్తుగా అమెరికాకు ఈ ఎయిర్‌బేస్ ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే… రక్షణ వ్యూహాత్మకతకు ఈ ఎయిర్ బేస్ ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఇరాన్‌కు అటు చైనాకు దగ్గరగా ఉంటుంది. ఇరాన్ నిర్వహించే అణు ప్రాజెక్టులపై నిఘా పెట్టాలన్నా, చైనాపై ఒత్తిడి తీసుకురావాలన్నా ఈ ఎయిర్‌బేస్ కీలకం. నిఘా కోసం ఈ ఎయిర్‌బేస్‌ను వినియోగించుకున్నారు.
కానీ, ఇప్పుడు ఈ ఎయిర్‌బేస్ చేజారిపోవడంతో ఆయా దేశాలపై నిఘా కొంతమేర తగ్గిపోయింది. అయితే, ఇరాక్‌లో అమెరికా ఎయిర్‌బేస్ ఉన్నప్పటికీ… చైనా నుంచి దూరం కావడంతో ఇరాన్‌ను నియంత్రించినా చైనాను నిలువరించడం కష్టంగా మారుతుంది. అందుకే బాగ్రామ్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని చూస్తున్నది. కానీ, ఆఫ్ఘనిస్తాన్ పాలకులు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎయిర్‌బేస్‌ను అప్పగించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా ఖండంలో మరోసారి ఉద్రిక్త కరమైన పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. అదే జరిగితే మరోసారి ఆసియా అనిశ్చితిలోకి జారిపోతుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమంటే బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను అమెరికా నిర్మించలేదు. అమెరికా కంటే ముందు సోవియట్ యూనియన్ 1950 కాలంలో రష్యా సహకారంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం నిర్మించింది. కోల్డ్‌వార్ సమయంలో ఈ ఎయిర్‌బేస్‌ను రష్యా వినియోగించుకుంది. రాజధాని కాబూల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ ఎయిర్‌బేస్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే, 2001లో అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి తరువాత, ఆఫ్ఘన్‌లోని ఈ ఎయిర్‌బేస్‌ను అమెరికా స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి తన కార్యకలాపాలను చేపట్టింది. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో పాటు కీలక ఆపరేషన్లను ఇక్కడి నుంచే నిర్వహించింది. 2021 తరువాత ఈ ఎయిర్‌బేస్ తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లింది. అయితే, ఇప్పుడు అమెరికా తమ ఎయిర్‌బేస్‌ను తిరిగి ఇవ్వాలని అడగంలో ఎటువంటి అర్థం లేదని నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లు దీనిని తిరస్కరించడం సమంజసమే.