రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు రైతన్నలకు, రాష్ట్ర ప్రజలకు విలన్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. తాను కోరినందుకే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పడం రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మేశాడనే విషయాన్ని బహిర్గతం చేస్తోందని ఆయన ఆరోపించారు.
రాయలసీమ ప్రాంతం ఎప్పటినుంచో నీటి సమస్యలతో ఇబ్బంది పడుతోందని, ఈ ప్రాజెక్టు రైతుల జీవితాలకు కీలకమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టును రాజకీయ లెక్కలతో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా, బయట రాష్ట్ర నాయకుల మాటలకు తలొగ్గి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
అదే సమయంలో చంద్రబాబు నాయుడు పాలనను ఉద్దేశించి వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంటవాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేయించి ఎంవోయూలు రాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేవలం ప్రకటనలు మాత్రమే ఇస్తున్నారని, అవి వాస్తవం కాదని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే పబ్లిసిటీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాయలసీమ రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం ఆపమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.