విజయనగరం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విజయనగరం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం ప్రదీస్ నగర్‌లోని సిరి సహస్ర భవంతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “సీనియర్ ఎమ్మెల్యే గారు పిట్ట కథలు చెబుతున్నారు” అంటూ విమర్శలు గుప్పించారు. రైతులకు అవసరమైన యూరియానే సకాలంలో పంపిణీ చేయలేని వారు ఎయిర్‌పోర్ట్ భూముల పంపిణీ గురించి మాట్లాడటం సబబు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, అలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వంటి హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. సీనియర్ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి జగన్, బొత్సలపై విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతి కాదన్నారు. ఎవరు చేసిన పనులకు వారికే క్రెడిట్ దక్కాలన్న ఆయన, ఇతరులు చేసిన అభివృద్ధిని తమదిగా చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. పథకాల పేర్లు మార్చి పంపిణీ చేస్తే గొప్పతనం రాదని, ఎవరి పాలనలో ప్రజలకు మేలు జరిగిందో ఇప్పటికే ప్రజలకు స్పష్టంగా తెలుసని మజ్జి శ్రీనివాస రావు అన్నారు. ఈ వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ చర్చకు దారి తీశాయి.