విశాఖపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వార్డు, జిల్లా స్థాయి కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ పరిధిలోని మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో ఆయన విస్తృతంగా చర్చించారు.
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రామ, వార్డు స్థాయిల్లో కమిటీల ఏర్పాటు వేగంగా కొనసాగుతోందని, ఈ ప్రక్రియను మరింత త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 7 వేల మందిని జిల్లా, వార్డు కమిటీల సభ్యులుగా చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఎక్కడైనా ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో చిన్న శ్రీను కుమార్తె సిరమ్మ మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో యువత, కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కమిటీల ఏర్పాటు ద్వారా కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, సమిష్టి కృషితో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని కేకే రాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు కదిరి బాబురావు, మాజీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.