Native Async

బీహార్‌ అసెంబ్లీకి రెబల్స్‌ బెడద… మంతనాలు ఫలిస్తాయా?

Bihar Assembly Elections 2025 Rebel Threats and Seat-Sharing Tensions
Spread the love

బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా గెలిచి బీహార్‌లో మళ్లీ పాగా వేయాలని ఆర్జేడి తహతహలాడుతోంది. మహాగఠ్‌బంధన్‌లో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే అత్యధిక స్థానాల్లో 130 నుంచి 145 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. అయితే, కాంగ్రెస్‌ ఈసారి 70 స్థానాలు కోరుతుండగా, 50 నుంచి 52 మాత్రమే ఇస్తామని చెబుతోంది ఆర్జేడీ. ఈ కూటమిలో మిగతా పార్టీలు కూడా తమకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నాయి. అయితే, గత ఓటమిని దృష్టిలో ఉంచుకొని ఆర్జేడీ సీట్లు ఇచ్చే విషయాన్ని వీలైనంత వరకు కుదించేలా ప్రయత్నాలు చేస్తోంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం వలనే పార్టీ ఓటమి పాలైంది. అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయింది. కానీ, ఈసారి ఆ తప్పు చేయకూడదని అనుకుంటోంది. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో, బీహార్‌లో ఒత్తిడి తీసుకురాదని నిపుణులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ గెలిచింది చాలా కొద్ది స్థానాలే. కూటమి అధికారంలోకి రాకపోవడానికి కాంగ్రెస్‌ ఒక కారణమని విశ్లేషకులు చెప్పిన సంగతి తెలిసిందే.

మహాగఠ్‌బంధన్‌పై పట్టు వదలకూడదని ఆర్జేడీ భావిస్తోంటే… అటు అధికారంలో ఉన్న ఎన్డీయేలో కొంత అనిశ్చితి నెలకొన్నది. ఎన్డీయేలో ప్రధాన పార్టీ బీజేపీ ఈసారి బీహార్‌లో 110 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఇప్పటికే 110 స్థానాలకు సంబంధించిన లిస్ట్‌ను ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి పంపింది కూడా. ఇక ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ జేడీయు 101 స్థానాలు కావాలని పట్టుబడుతోంది. గత ఎన్నికల్లో జేడీయు గెలిచుకుంది కొన్ని స్థానాలే అయినప్పటికీ బీజేపీతో జట్టుకట్టడంతో ఆయన్నే ముఖ్యమంత్రిగా ప్రకటించారు.

ఇప్పుడు కూడా నితీష్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లోకి వెళ్తున్నారు. కానీ, కనీసం 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండాల్సిందేనని నితీష్‌ పట్టుబడుతున్నారు. ఇక ఈ కూటమిలో మరో ముఖ్యమైన పార్టీ హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా. ఈసారి తమకు 15 స్థానాలు ఇవ్వాలి ఆ పార్టీ అధినేత, కేంద్రమంత్రి జితన్‌రామ్‌ మంఝీ పట్టుబడుతున్నాడు. లోక్‌జనశక్తి పార్టీ కూడా సీట్ల విషయంలో కొంత పట్టుపడుతోంది. అయితే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగి వీరిని బుజ్జగిస్తున్నట్టుగా సమాచారం. నామినేషన్ల పర్వం కూడా మొదలుకాబోతున్న నేపథ్యంలో ఎవరు రెబల్‌గా మారుతారో ఎవరు కూటముల్లో కొనసాగుతారో చూడాలి.

ట్రంప్‌ టారీఫ్‌ ముచ్చట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit