ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. తనకు ఇవే చివరి ఎన్నికలు అని, తనను ఈసారి గెలిపించాలని గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజల కూడా యాక్సెప్ట్ చేసి ఆయన్ను గెలిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి విజయం అందించారు. ఈ చిరస్మరణీయమైన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అవసరమైన అన్ని విషయాలను, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడి వరకు సరే. మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పక్కకు తప్పుకుంటే తెలుగుదేశం పార్టీని అంత సమర్థవంతంగా నడిపించేది ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్న.
చంద్రబాబు తరువాత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, చంద్రబాబు నాయుడు మాదిరిగా నారా లోకేష్ ఎంతవరకు సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు అన్నది చూడాలి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిలోనే ఉంటే…కూటమి తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్‌ను ప్రకటించే అవకాశం ఉండదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మంత్రిగా నారా లోకేష్ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టం.
కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పనవ్ కళ్యాణ్?
ఈ నేపథ్యంలోనే కూటమి తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు అవకాశం ఇస్తారు అనే టాక్ వినిపిస్తున్నది. బీజేపీకి పవన్ కళ్యాణ్ ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. కేంద్రంలో ప్రధాని మోదీ వద్ద ఆయనకు మంచి పేరు ఉంది. అంతేకాదు, గత ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య అనుసంధానకర్తగా జనసేనాని అలుపెరుగని కృషిచేశాడు. ఈ కూటమి ఏర్పడిన తరువాతే విజయం లభించింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. 100శాతం స్ట్రైక్ రేట్ సంపాదించడమే కాకుండా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన చేస్తున్నాడు. పాలనా పరమైన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం ఒక పేరు కోసమే కాకుండా రాష్ట్రంలో నిత్యం పర్యటిస్తూ… పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
కీలక అంశాలపై అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలోనూ, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంలోనూ పవన్ కళ్యాణ్ చొరవచూపుతున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు ఒక్క మాటతో పరిష్కారం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఏపీలో అత్యంత బలహీనంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ ఆ పార్టీ ఆవిధమైన విజయాన్ని సాధించలేదు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే. బీజేపీ కోసం అవసరమైతే జనసేన పోటీ చేసే స్థానాలను కూడా తగ్గించుకుంది. తనకు కేటాయించాలి అనుకున్న పలు స్థానాలను బీజేపీకి కేటాయించేలా చేసింది. ఈ కారణంగానే జనసేన పార్టీకి కేంద్ర స్థాయిలో మంచి పేరుంది.
వైసీపీ దారెటు?
ఇకపోతే చివరిగా చెప్పుకోవలసింది వైసీపీ గురించే. 2019 ఎన్నికల్లో ఉవ్వెత్తున ఎగసి 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ… ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా వరకు వైసీపి మంచి నిర్ణయాలే తీసుకుంది. కానీ, అవసరం కంటే కూడా అనవసరమైన నిర్ణయాలు పార్టీని ఓటమిపాలు చేశాయి. ఉచిత పథకాలు ఎన్నడూ విజయం సాధించలేవని పార్టీ గుర్తించలేకపోయింది. పథకాల కంటే అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకున్నారు. అభివృద్ధి జరిగితేనే ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ విషయాన్ని పార్టీ గుర్తించలేకపోయింది. ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైంది. వాలంటీర్ వంటి మెగా వ్యవస్థను రూపొందించి ఏపీలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని అనుకున్నా… అది అన్ని చోట్ల పనిచేయలేదు. ప్రజలు అందించిన విజయాన్ని… పాలనకోసం కాకుండా పగల కోసం వినియోగించారనే ఆరోపణలు కూడా పార్టీ పరాజయానికి కారణమయ్యాయి. చరిత్రలో అత్యంత దారుణంగా కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది. మరి ఈ మూడేళ్ల కాలంలో పార్టీ నాయకుడు పరదాలు వదిలేసి ప్రజల్లోకి వస్తేనే రాబోయే ఎన్నికల్లో కొంతమేర రాణించే అవకాశాలు ఉంటాయి. 2019లో బీజేపీ కూటమిలో చేరకుండా ఉండటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం, 2024 ఎన్నికల్లో కూడా కేంద్రంతో పనిలేదు అనేవిధంగా ప్రవర్తించడమే పార్టీ ఓటమికి ప్రధాన కారణం. మరి 2029 ఎన్నికల్లో బీజేపీ కూటమిలో వైసీపీ చేరుతుందా? అంటే ప్రస్తుతానికి అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మహాకూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా ఆ కూటమిలో చేరితే… ప్రతిపక్షం, అధికార పక్షం ఒకే కూటమిలో ఉన్నట్టు అవుతుంది. తెలుగుదేశం వైసీపీకి, జనసేన వైసీపీకి మధ్య అగ్గి వేయకుండానే భగ్గుమంటుంది. ఈ రెండూ పార్టీలున్న కూటమిలో వైసీపీ జాయిన్ కావడం ఇంపాజిబుల్. మరి ఏపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కాలమే నిర్ణయించాలి.