తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో పార్టీలు తమ బలాన్ని పెంచుకునేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రధానంగా అభ్యర్థుల విజయంలో ప్రముఖ పాత్రను పోషించేది పొత్తులు. సరైన సమయంలో సరైన పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు విజయం లభిస్తుంది. ఈ విజయం కోసం పార్టీలు నిరంతరం శ్రమిస్తుంటాయి. అధికారంలో ఉన్న డీఎంకే మరోసారి విజయం సాధించి తీరుతామని స్పష్టం చేస్తున్నది. తాము అధికారంలో ఉండగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చెపట్టినట్టు డీఎంకే చెబుతున్నది. అయితే, ఒక వర్గం వారిని అక్కున చేర్చుకొని, రాష్ట్రంలో కీలకమైన వర్గాలను పక్కన పెడుతున్నారని, వారిపై సీతకన్నుతో ఉన్నారని అంటున్నారు.
పాలక పార్టీలోని లోపాలను ఎత్తిచూపుతూ వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే ప్రయత్నాలు మొదలుపెట్టింది. శతృవుకు శతృవు మిత్రుడు అనే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పొత్తల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే పీఎంకేతో పొత్తు కుదుర్చుకున్నది. కొన్ని ప్రాంతాల్లో పీఎంకే పార్టీకి బలమైన మద్దతు ఉంది. సామాజిక వర్గాల ఆధారంగానే ఎన్నికల గెలుపొటములు ఉంటాయి. కొన్ని సామాజిక వర్గాలను కొన్ని పార్టీలు శాసిస్తుంటాయి. ఇది అనాదిగా వస్తున్న అంశమే.
అయితే, తమిళనాడులో స్థానిక పార్టీలదే ప్రధాన బలం. జాతీయ పార్టీలకు పెద్దగా స్కోప్ ఉండదు. డీఎంకేలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం కొన్ని సీట్లకు మాత్రమే పరిమితంగా ఉంది. గత ఎన్నికల్లోనూ, అన్నా డీఎంకే ప్రభుత్వంలోనూ బీజేపీ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. జయలలిత మరణం తరువాత, అన్నా డీఎంకేకి జాతీయ స్థాయిలో బీజేపీ మద్దతు ప్రకటించింది. కేంద్రం నుంచి మద్దతు లభించడంతో ఐదేళ్లపాటు పాలన సజావుగా కొనసాగింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షానికే పరిమితమైన అన్నాడీఎంకే ఎలాగైనా ఈసారి బలమైన మెజారిటీతో విజయం సాధించి సీఎం కుర్చీని సొంతం చేసుకోవాలని అనుకుంటోంది.
ఇదిలా ఉంటే సీనీరంగం నుంచి వచ్చిన కమల్ హాసన్ పార్టీ గత ఎన్నికల్లో చతికిలపడిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరో స్టార్ నటుడు విజయ్ టీవీకే పేరుతో పార్టీని ప్రకటించి ప్రచారం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ జరుగుతున్నది. స్టార్ హోదా నటుడు కావడంతో ఆయనకు మామూలుగానే ప్రజాదరణ ఉంటుంది. అయితే, ఈ ప్రజాదరణ ఓటింగ్‌గా మారుతుందా అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తులు లేకుండా తమిళనాడులో పోటీ చేయడం చాలా కష్టం. ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం పెద్దగా లభించదు. ఈ నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అన్నది ఆసక్తికరం.
అన్నా డీఎంకే బీజేపీతో పొత్తు ఉన్నా… అంటి ముట్టనట్టుగా ఉంటోంది. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు ఉంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అన్నది కూడా తెలియాల్సి ఉంది. పార్టీకి పెద్ద నగరాల్లో మంచి పట్టున్నది. ఓటర్లు జాతీయ నాయకత్వం వైపు, జాతీయ పార్టీలవైపు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనా విధమైన నిర్ణయాలు, అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తున్నది. మరి తమిళనాడులో బీజేపీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయనే చెప్పవచ్చు. ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు…ఎవరిని ఓడిస్తారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.