తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో… బీజేపీ–జనసేన పొత్తు ఉంటుందా? లేదా రెండూ విడివిడిగా బరిలోకి దిగుతాయా? అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించినట్లు ప్రకటించింది. ఇందుకోసం కమిటీల ఏర్పాటు, కార్యకర్తలను క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో ప్రతి జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటనలో ఎక్కడా పొత్తుల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
ఇక ఏపీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఉన్న నేపథ్యంలో, అదే ఫార్ములా తెలంగాణలో కూడా అమలవుతుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ గత కొన్నేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉండటం, ఈసారి కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో జనసేన ఎన్నికల్లో పోటీ చేయని సందర్భాల్లోనూ బీజేపీ నేతలు ఆ పార్టీ మద్దతును కోరిన ఉదంతాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆయన ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, ప్రజల్లో పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోందని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో బీజేపీ ఉందని స్పష్టం చేశారు. అయితే పొత్తుల అంశం జాతీయ నాయకత్వం పరిధిలో ఉంటుందని, తుది నిర్ణయం అక్కడే తీసుకుంటారని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
మొత్తానికి… తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ ఖాయమైనప్పటికీ, బీజేపీతో పొత్తు ఉంటుందా? లేక రెండు పార్టీలు విడివిడిగా బరిలో దిగుతాయా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. రానున్న రోజుల్లో జాతీయ నాయకత్వాల నిర్ణయాలే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరదించనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.