కోనసీమ, అక్టోబర్ 28, 2025, సాయంత్రం 6:30: బంగాళాఖాతంలో గాలులు మళ్ళీ హోరెత్తుతున్నాయి… ఆ గాలిలో ఒక భయానక అనుభవం ఉంది — భయం, బాధ, నష్టం, మరపురాని 1996 తుపాన్ ప్రళయ రోదన. మోంతా తుపాన్ దగ్గరపడుతుండగా, కోనసీమ ప్రజల గుండెల్లో మళ్లీ ఆ రాత్రి మంటలు రగులుతున్నాయి. సముద్రం దగ్గర వున్నవారికి ప్రతి అల కూడా ఒక జ్ఞాపకం —ఒక కాళరాత్రి.
గర్భ శోకంతో కోనసీమ కన్నీరు కార్చింది...
1996 నవంబర్ 6వ తేదీ రాత్రి 9:30 గంటలకు కాకినాడ–యానాం తీరాన్ని తాకిన ఆ తుపాన్, ఒక క్షణంలోనే వేలాది జీవితాలను తుడిచేసింది. గంటకు 215 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఇళ్లు కూల్చాయి, విద్యుత్ తీగలను చీల్చాయి, వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి,. ఆకాశం ఉరుమింది, సముద్రం కేకలు వేసింది, నేల భయంతో వణికింది. కోనసీమ ప్రజల ఆర్తనాదాలు ఆ గాలిలో కలసిపోయాయి.
కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు ఆ రాత్రి దెబ్బతిన్న హృదయాల్లా మారిపోయాయి. భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాలు సముద్ర అలలతో పూర్తిగా మునిగిపోయాయి.ఆ నాటి భయానక రాత్రిని తలుచుకుని వృద్ధులు ఈరోజు కూడా కన్నీళ్లతో ఆకాశం వైపు చూస్తారు. ఒకప్పుడు పచ్చని పొలాలు ఉన్న చోట, ఆ రాత్రి తర్వాత మిగిలింది కేవలం శిధిలాల స్మృతులే.
గాలి ఎలా గర్జించిందో, పైకప్పులు ఎగిరిపోయి, పిల్లలు తల్లుల ఒడిలో వణికిన దృశ్యాలు — ఇవన్నీ ఇప్పటికీ వారిని వెంటాడుతున్నాయి. రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో సహాయక బృందాలు ఆలస్యమయ్యాయి. ఆ రాత్రి తల్లి బిడ్డను, భర్త భార్యను, గృహం తన ఆధారాన్ని కోల్పోయింది. బిడ్డల్ని కోల్పోయిన కోనసీమ గర్భ శోకంతో కన్నీరు కార్చింది
ఇప్పుడు మోంతా సముద్రంలో మళ్ళీ గాలిని కదిలిస్తుంటే, ప్రజల గుండెల్లో భయం తిరిగి బలపడుతోంది. “ఆ రాత్రి గాలి హోరు ఇప్పటికీ చెవుల్లో మోగుతూనే ఉంది,” అంటున్నాడు ఉప్పలగుప్తం వృద్ధ మత్స్యకారుడు. “మళ్లీ అదే గాలి, అదే వాతావరణం, అదే భయపు వాసన…” అతని మాటల్లో నిండింది ఒక జీవితకాల గాయం.
ప్రస్తుతం ప్రభుత్వం విపత్తు స్పందన బృందాలను సిద్ధం చేస్తోంది, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తోంది. అయినా కోనసీమ ప్రజల మనసుల్లో ప్రశాంతత లేదు. వారికి ప్రతి ఉరుము, ప్రతి గాలి దెబ్బ, ప్రతి సముద్ర అల — 1996 తుపాన్ కేకల మిగిలిన ప్రతిధ్వనిలా అనిపిస్తోంది. మోంతా రానుందేమో కానీ, 1996 తుపాన్ మాత్రం వారి హృదయాలనుంచి ఎప్పటికీ వెళ్లిపోలేదు.