కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రయాణాలపై ఆసక్తి సహజంగా పెరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు కలిసివస్తే కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. జనవరి నుంచి మార్చి వరకు వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉండటంతో దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు మరింత ఆకర్షణీయంగా మారతాయి. ఈ సమయంలో తప్పక దర్శించాల్సిన ప్రదేశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కాశ్మీర్‌లోని గుల్మార్గ్. మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రపంచ ప్రసిద్ధ గుల్మార్గ్ గోండోలా రైడ్, అఫర్వాట్ శిఖరం అక్కడి అందాలను రెట్టింపు చేస్తాయి. స్నో లవర్స్‌కు ఇది నిజంగా స్వర్గధామం.
శీతాకాల ప్రయాణం ఇష్టపడేవారికి రాజస్థాన్‌లోని జైసల్మేర్ మరో అద్భుతమైన గమ్యం. బంగారు మట్టితో మెరిసే జైసల్మేర్ కోట, ఎడారి సఫారీ, పట్వోన్ కీ హవేలి లాంటి చారిత్రక కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే రాయల్ అనుభూతిని కోరుకునేవారికి ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా సరస్సు మనసును మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక ప్రకృతి, ప్రశాంతత కోరుకునేవారికి కేరళలోని వర్కల బీచ్ చక్కని ఎంపిక. సముద్ర అలల శబ్దం, సుందరమైన సూర్యాస్తమయాలు, స్వచ్ఛమైన గాలి మనసుకు కొత్త శక్తిని ఇస్తాయి. ఈ సంక్రాంతి సెలవుల్లో ఈ ప్రదేశాలను సందర్శిస్తే మీ ప్రయాణం నిజంగా మరపురాని అనుభూతిగా మారడం ఖాయం.