యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లను కలిపి తయారు చేసే ఏబీసీ జ్యూస్‌ను ఆరోగ్యపానీయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. వారంలో కనీసం రెండు మూడు రోజుల పాటు ఈ జ్యూస్‌ను తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని విటమిన్ ఏ, బి, సి, కెతో పాటు ఐరన్, మ్యాగ్నిషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి.
ఈ జ్యూస్ రక్తాన్ని శుభ్రపరచి, లివర్ డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడి, రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. చర్మం సహజంగా మెరిసేలా చేస్తూ వయస్సు పెరిగినా యవ్వన కాంతి నిలిపేందుకు ఉపయోగపడుతుంది.
ఇందులోని క్యారెట్ కంటి చూపును మెరుగుపరచి విటమిన్-ఏ లోపాన్ని తీర్చుతుంది. బీట్‌రూట్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. యాపిల్ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ఈ మూడు కలిపినప్పుడు శరీరం రోజంతా ఉత్సాహంగా, ఎనర్జీగా ఉండేలా చేస్తాయి.
అదేవిధంగా ఈ జ్యూస్ అధిక బరువును నియంత్రించడంలో, కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రత్యేకించి టైప్2 డయాబెటిస్ ఉన్నవారు, యువత, ఉద్యోగ ఒత్తిడిలో ఉన్నవారు, చదువులో మునిగిపోయిన విద్యార్థులు ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది. అయితే కిడ్నీ సమస్యలు లేదా షుగర్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ జ్యూస్‌ను తీసుకోవడం మంచిది.