ప్రపంచ సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్‌కి కొత్త యుగాన్ని తెరిచిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. టైటానిక్‌తో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న కామెరూన్, అవతార్‌తో విజువల్ వండర్ అని నిరూపించుకున్నారు. ప్యాండోరా అనే కల్పిత ప్రపంచాన్ని అద్భుత విన్యాసాలతో చూపించి, సినీ ప్రేక్షకుల ఊహాశక్తిని మరింత విస్తరింపజేశారు.
అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా ₹19,850 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సిరీస్‌లో మూడో భాగం అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి దాదాపు ₹2,137 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించగా, ప్రపంచవ్యాప్తంగా ఇది ₹25 వేల కోట్లకు పైగా వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సెకండ్ పార్ట్ షూటింగ్‌కు సమాంతరంగా మూడో భాగం కొంతవరకు చిత్రీకరించడంతో భారీ ఖర్చును తగ్గించగలిగారని ఫిల్మ్ వర్గాలు తెలిపాయి. ఈ పార్ట్‌లో యాష్ తెగను ముందుకు తీసుకురాబోతుండగా, వారి పాత్రల రూపకల్పన, సంస్కృతి, భావోద్వేగాలు ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకుంటాయని అంచనా. ఇంగ్లీష్‌తో పాటు భారత్‌లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ప్రపంచ సినీ అభిమానులు ఇప్పుడు కామెరూన్ మాయను మళ్లీ చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.