ఆటో డ్రైవర్ల సమస్యకు హైడ్రా శాశ్వత పరిష్కారం

హైదరాబాద్‌లో ప్రధాన సమస్య ట్రాఫిక్‌, పార్కింగ్‌. ఈ రెండు సమస్యలు ప్రజలను వాహనదారులను ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి. వీటినుంచి బయటపడేందుకు అటు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ పెరుగుతున్న వాహనాలు, జనాభా కారణంగా తాత్కాలిక పరిష్కారం మాత్రమే లభిస్తూ వస్తున్నది. ఇక అంబర్‌పేట్‌ పరిధిలోని బతుకమ్మ కుంట ఒకప్పుడు చెత్తాచెదారంతో, ఆక్రమణలతో నిండిపోయి ఉండగా, స్థానికులు ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడిపోయేవారు. అయితే హైడ్రా (HYDRA) అధికారులు చేపట్టిన సుందరీకరణ పనులతో ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా రూపుమారింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, వృద్ధుల కోసం సేదతీరే గుమ్మటాలు ఏర్పాటు చేయడంతో బతుకమ్మకుంట ఇప్పుడు సాయంత్రం వేళల్లో కుటుంబాల సందడితో కళకళలాడుతోంది.

ఈ అభివృద్ధి వెనుక ఉన్న మరో ముఖ్యమైన అంశం – పారిశుద్ధ్య ఆటో డ్రైవర్లకు హైడ్రా అందించిన మద్దతు. జీహెచ్‌ఎంసీ తరఫున చెత్త సేకరణ చేసే ఆటో డ్రైవర్లు ఇన్నాళ్లుగా పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పునరుద్ధరణకు ముందు వారు తమ ఆటోలను చెరువు ప్రాంగణంలోనే నిలిపేవారు. అయితే సుందరీకరణ ప్రారంభమైన తర్వాత ఆ స్థలం పోయింది. దీన్ని గమనించిన హైడ్రా అధికారులు డ్రైవర్ల విజ్ఞప్తికి స్పందించి, బతుకమ్మకుంట సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర వారికి కొత్త పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ఈ చర్యతో ఆటో డ్రైవర్లకు ఊరట లభించింది.

స్థానికులు హైడ్రా ప్రయత్నాలను ప్రశంసిస్తూ – “చెత్తతో నిండిన చెరువును ఇంత అందంగా మార్చి, ప్రజలకు విశ్రాంతి స్థలంగా తీర్చిదిద్దడం గొప్ప పని. అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను కూడా పరిష్కరించడం అభినందనీయం” అని తెలిపారు.

బతుకమ్మకుంట ప్రాజెక్ట్ ఇప్పుడు నగరాభివృద్ధిలో ఒక మోడల్‌గా నిలుస్తోంది. పర్యావరణ సంరక్షణతో పాటు ప్రజల సౌకర్యాల దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్ట్, పరిశుభ్రత మరియు సౌందర్యం కలిసి నడిచే మార్గాన్ని చూపిస్తోంది. బతుకమ్మకుంట ఇకపై కేవలం చెరువు కాదు – హైదరాబాద్‌కు మరో జీవవనరుగా, ప్రజల గర్వకారణంగా మారింది. ఒక్క బతుకమ్మ కుంట మాత్రమే కాదు, నగరంలో ఇలాంటి చెత్తలతో నిండిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిపై కూడా హైడ్రా దృష్టి సారిస్తే నగరానికి కొత్తశోభ వస్తుంది. పొల్యూషన్‌తో ఇబ్బంది పడుతున్న వారికి కాస్త రిలీఫ్‌ దొరుకుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *