ఎక్కడ చౌవకైతే అక్కడే కొంటాం…అమెరికావి తాటాకు చప్పుళ్లే

రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోందని, భారత్‌ చమురు కొనుగోలు చేయడం వలన వచ్చే ఆదాయంతో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోందని, రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్‌ ఆర్థికంగా సహాయం చేస్తోందని అమెరికా ఆరోపిస్తూ… భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌ నుంచి కూడా ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్‌ టారిఫ్‌లను భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. తమ ఆర్థిక విధానాలు, తమ నిర్ణయాలను వాషింగ్టన్‌ నిర్ణయించలేదని, తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా ఎవరు ఏమి మాట్లాడినా తిప్పికొడతామని బదులిచ్చింది. అంతేకాదు, రష్యాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తామని పునరుద్గాటించింది. ఇందులో భాగంగానే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ రష్యాలో పర్యటించారు. పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం జరిపారు. పుతిన్‌ను భారత్‌కు ఆహ్వానించారు.

ఇప్పటి వరకు శతృవుగా పరిగణిస్తూ వస్తున్న చైనాతో కూడా చేతులు కలిపేందుకు భారత్‌ సిద్ధమయింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ఇప్పటికే చైనా విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు కూడా నిర్వహించారు. భారత్‌, రష్యా, చైనా దేశాలు ఉమ్మడిగా ఆర్థిక ప్రణాళికను, వాణిజ్య ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. ఈ మూడు దేశాల మధ్య ఒప్పందాలు జరిగితే వాణిజ్యం 54 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలు ప్రస్తుతానికి ఆదేశానికి కొంత వరకు బాగానే ఉన్నా రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. భారత్‌ అమెరికాకు ఎగుమతులను నిలిపివేస్తే అక్కడ చాలా వరకు ఫ్యాక్టరీలు మూతపడే అవకాశాలు ఉంటాయి. అక్కడి వ్యాపార, వాణిజ్య, ఉద్యోగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పోస్టల్‌ సర్వీసులను భారత్‌ నిలిపివేసింది.

మేక్‌ ఇన్‌ ఇండియాను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని భారత్‌ భావిస్తోంది. ఈ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయగలిగితే ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతులు చాలా వరకు తగ్గిపోతాయి. ఫలితంగా భారత్‌ నుంచి చౌక ధరకు దిగుమతులు ఆగిపోతాయి. ఇది ఆ దేశానికి మంచిది కాదన్నది నిపుణుల విశ్లేషణ. ట్రంప్‌ రాజకీయంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. డాలర్‌ పతనానికి కూడా ఇది నాంది కావొచ్చు. ఇప్పటికే పలు దేశాలు సొంత కరెన్సీతోనే మార్కెట్‌ చేసుకోవాలని, అమెరికా డాలర్‌ మారకాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. డాలర్‌ మారకం వలన ఆ దేశానికి మారకం రుసుము చెల్లించాల్సిన పరిస్థితుల నుంచి బయటకు రావాలని పలు దేశాలు చూస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి.

ఇక ప్రపంచ దేశాలను శాసిస్తున్నది ఆయిల్‌ రంగమే. ఆయిల్‌ లేకుండా మనిషి జీవనాన్ని ఊహించలేడు. చమురు కోసమే పలు దేశాలు కోట్లాది డబ్బును ఖర్చు చేస్తున్నాయి. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు తక్కువ ధరకు ఎక్కడ ఆయిల్‌ లభిస్తే అక్కడే కొనుగోలు చేస్తున్నాయి. రష్యా కరెన్సీ విలువ భారత్‌ కరెన్సీతో దాదాపుగా సమానంగా ఉండటంతో రష్యా నుంచే ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అవసరమైతే ఇంకా తక్కువ ధరకు ఆయిల్‌ను విక్రయించేందుకు కూడా సిద్దంగా ఉన్నది. అమెరికా చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని భారత్‌ స్పష్టం చేయడం ఆ దేశానికి మింగుడు పడని అంశమే. ఇదీ చాలదన్నట్టుగా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు సపోర్ట్‌ చేస్తూ ఆదేశాన్ని ప్రోత్సహిస్తోంది.

రంగులు మారే శివలింగం… భూగర్భంలో వేంకటేశ్వరుడు…ఎక్కడో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *