ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…నోబెల్‌ సాధించినవారికి వందకోట్ల ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన విజన్‌ను స్పష్టంగా వివరించారు. ‘క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, క్వాంటం టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఏపీని తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి వంద కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేస్తామని ప్రకటించడం ద్వారా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

25 ఏళ్ల క్రితం ఐటీ విజన్‌తో హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చిన అనుభవాన్ని గుర్తు చేసిన సీఎం, అదే తరహాలో ఇప్పుడు అమరావతిని ప్రపంచస్థాయి ‘క్వాంటం వ్యాలీ’గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సిలికాన్ వ్యాలీ మాదిరిగా పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలు ఒకే చోట సమ్మిళితమయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భారతీయుల డీఎన్ఏలోనే విజ్ఞానం ఉందని, ప్రాచీన కాలం నుంచే గణితం, ఖగోళశాస్త్రాల్లో మన ప్రతిభ ప్రపంచానికి తెలిసినదేనని పేర్కొన్నారు.

యువతకు ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పిన చంద్రబాబు, లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడానికి ప్రత్యేక స్కిల్ రోడ్‌మ్యాప్ అమలు చేస్తున్నామని వివరించారు. వైద్యం, వ్యవసాయం, వాతావరణ అంచనా, రక్షణ రంగాల్లో క్వాంటం టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. భవిష్యత్ టెక్నాలజీల్లో ఏపీ ఎప్పుడూ ముందుండి నడుస్తుందని, ‘ఫస్ట్ మూవర్’గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *