దసరా పండుగ దేశమంతటా ఒకే భావనను ప్రతిబింబిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపం ఈ పండుగ. ప్రతి ప్రాంతంలో వేడుకలకు ఒక్కో ప్రాముఖ్యత, ప్రత్యేకత కనిపిస్తుంది. గుజరాత్లో రంగు రంగుల దుస్తులు, గాజులు ధరించిన మహిళలు గార్భా డ్యాన్స్ చేస్తూ రాత్రంతా ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు. ఇది కేవలం నృత్యం మాత్రమే కాకుండా, సాముహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది.
ఇక పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ భావోద్వేగాలతో నిండి ఉంటుంది. దుర్గాదేవిని స్వగృహానికి ఆహ్వానించినట్లుగా భావించి, చివరి రోజున వివర్జనం చేస్తారు. ఈ సందర్భంగా అత్తగారింటికి పంపించే సమయంలో ఉండే కన్నీళ్లు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. దక్షిణాదిన తమిళనాడులో బొమ్మల కొలువు వైభవంగా అలరించగా, తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పూలను వరుసగా పేర్చి బతుకమ్మను నిర్వహిస్తారు. కేరళలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం చేస్తారు. ఉత్తర భారతదేశంలో కన్యాపూజ ద్వారా అమ్మవారిని బాలికల రూపంలో ఆరాధిస్తారు. ప్రాంతాలు వేరు, పద్ధతులు వేరు అయినా, దసరా ఉత్సవాల అంతరంగం ఒక్కటే – ధర్మం, శక్తి, సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని సమాజానికి గుర్తు చేస్తుంది.