రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్

•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సానుకూల స్పందన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు
•టి.టి.డి. నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి.

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టి.టి.డి. సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదనలు చేశారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమై టి.టి.డి. ఛైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు గారితో చర్చించారు. టి.టి.డి. బోర్డు రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు గారు, ఏపీ శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారు, టీటీడీ బోర్డు మెంబర్లు శ్రీ బి.ఆనందసాయి గారు, శ్రీ బి.మహేందర్ రెడ్డి గారు, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శ్రీ ఎన్ శంకర్ గౌడ్ గారు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు తదితరులు పాల్గొననున్నారు.

జనసేన కార్యకర్తలతో సమావేశం:
ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు శ్రీ ఆర్.కె.సాగర్, శ్రీ రాజలింగం, శ్రీ దామోదర్ రెడ్డి, శ్రీమతి ఎం. కావ్య, శ్రీమతి పి. శిరీష తదితరులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *