శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ఏడు గంగల జాతర

శ్రీకాళహస్తి పట్టణంలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా ఏడు గంగల జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంప్రదాయబద్ధంగా గంగమ్మ ఆలయం నుంచి ఏడు గంగమ్మలను మూలస్థానాలకు అత్యంత శోభాయమానంగా తీసుకెళ్లారు. జాతర ప్రారంభానికి ముందు బేరివారి మండపం వద్ద నిర్వహించిన కొండమిట్ట చాటింపు ఉత్సవం విశేష ఆకర్షణగా నిలిచింది. తెట్టురాయి గంగమ్మకు ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు సారెను సమర్పించి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ముత్యాలమ్మ ఆలయ సమీపంలోని ఏడు గంగమ్మల ఆలయంలో గంగమ్మ మూలవిరాట్‌కు శాస్త్రోక్తంగా అభిషేకాలు, మహా నైవేద్యం చేపట్టారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలు, పసుపు ముద్దల ప్రతిమలను ప్రత్యేక పూజలతో గంగమ్మ కమిటీలకు అందజేశారు.

తమ తమ ప్రాంతాల్లో గంగమ్మలను తీసుకెళ్లిన కమిటీలు సంప్రదాయ పూజలతో గ్రామోత్సవాలను ప్రారంభించాయి. భక్తులు పెద్దఎత్తున వచ్చి మొక్కులు తీర్చుకుంటూ అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

పురాణ ప్రచార ప్రకారం, ప్రాచీన కాలంలో ప్రజలు వ్యాధులతో బాధపడుతుండగా ప్రతిష్ఠించిన ఏడు తెట్టు రాళ్లు దైవ శక్తిగా మారి గంగమ్మలుగా పూజింపబడినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఈ జాతర నిరంతరంగా కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *