తెలంగాణ అసెంబ్లీలు ప్రారంభమైన కాసేపటికే కేసీఆర్‌

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ నుంచి నిష్క్రమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ప్రారంభానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నందినగర్‌లోని తన నివాసం నుంచి శాసనసభకు వచ్చిన కేసీఆర్‌ జాతీయ గీతం పూర్తైన వెంటనే సభను వీడారు. మొత్తం మూడు నిమిషాలపాటు మాత్రమే సభలో ఉన్న ఆయన, ఎలాంటి ప్రసంగం చేయకుండా వెళ్లిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామం వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక ఆరోగ్య కారణాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలపై చర్చకు అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి.

జనవరి 2న కృష్ణా బేసిన్‌పై, జనవరి 3న గోదావరి బేసిన్‌పై రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశం ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీ కూడా సన్నద్ధమవుతోంది. ఈ రోజు శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దివంగత సభ్యులకు ఉభయసభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభ, శాసనమండలిని వాయిదా వేయనున్నారు. అనంతరం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద సమావేశాల ప్రారంభ దశలోనే చోటుచేసుకున్న ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *