అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ శ్లాబ్‌… మార్కెట్‌కు డిమాండ్‌ పెరుగుతుందా?

జీఎస్టీ 2.0 నేటి నుంచి అమల్లోకి వచ్చింది. సామాన్యులకు ఊరటనిచ్చే విధంగా సంస్కరణలు చేపట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గతంలో జీఎస్టీ శ్లాబ్‌లు 5 శాతం, 12 శాతం, 18శాతం, 28 శాతంగా ఉండగా, వీటిని కుదించి రెండు శ్లాబ్‌లుగా మార్చారు. ప్రస్తుతం 5శాతం, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలతో పాటు సామాన్యులకు అవసరమైన వస్తువులను 5 శాతం శ్లాబ్‌కిందకు తీసుకురావడంతో వీటికి సంబంధించిన ధరలు తగ్గనున్నాయి. ఈ వస్తువుల ధరలు తగ్గడంతో మార్కెట్‌లో వేగం పుంజుకోనుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా దినసరి వినియోగ వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కొన్ని ఆటోమొబైల్‌ విభాగాలు కూడా తక్కువ ధరలో వినియోగదారులకు అందనున్నాయి. వ్యాపారవేత్తల అభిప్రాయం ప్రకారం, ధరలు తగ్గడం వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, దాంతో మార్కెట్‌లో డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిన అమ్మకాలు, ఈ నిర్ణయంతో మళ్లీ ఊపందుకోవచ్చని ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఆర్థిక నిపుణులు అభిప్రాయం ప్రకారం కొత్త జీఎస్టీ శ్లాబ్‌ కారణంగా తాత్కాలికంగా డిమాండ్‌ పెరుగుతుందని, అయితే, దీర్ఘకాలికంగా చూసుకుంటే ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కారణంగా మళ్లీ ధరలను ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. కొత్త జీఎస్టీ శ్లాబ్‌ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. సామాన్య కుటుంబాలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంతో వినియోగం పెరుగుతుందని, స్థానికంగా ఉండే మార్కెట్లకు పునర్వైభవం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో లగ్జరీ వస్తువుల ధరలు భారీగా పెరగడంతో వాటి వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచే అవకాశం ఉంది. ఈ మార్పు ఇలానే కొనసాగాలి అంటే వస్తు ఉత్పత్తులపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. ఉత్పత్తిని పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా డిమాండ్‌ పెరిగినా ధరలు పెరగకుండా మార్కెట్‌ స్థిరంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *