చనుపల్లివారి గూడెం ఎస్సీ శ్మశాన వాటికకు ప్రహరీ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మా గ్రామంలో ఉన్న ఎస్సీ శ్మశాన వాటికకు రక్షణ కరవయ్యింది. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్నాము. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. మా సమస్యకు పరిష్కారం చూపించండి అని ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, మాదలవారి గూడెం గ్రామ శివారు చనుపల్లివారి గూడెం ప్రజలు తమ సమస్యను తెలియజేస్తూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం అందజేశారు.

ఆ రోజు కొండపావులూరులోని ఎన్.ఐ.డి.ఎం.లో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమానికి హాజరై తిరుగు వస్తుండగా మార్గమధ్యంలో చనుపల్లివారిగూడెం గ్రామస్తులు తమ సమస్యను చెప్పుకొన్నారు. వినతి పత్రాన్ని పరిశీలించిన ఆయన వెంటనే శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి చొరవతో ఈ రోజు (31.10.2025) ఎస్సీ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం పనులు తక్షణం ప్రారంభించేందుకు తొలి విడతగా రూ. 10 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదే రోజు వచ్చిన మరో అర్జీకి పరిష్కారం చూపుతూ ముస్తాబాద జెడ్పీ హైస్కూల్ ప్రహరీ నిర్మాణానికి మరో రూ. 10 లక్షలు విడుదల చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి ఈ నిధులు మంజూరు చేశారు. ఈ విజ్ఞాపనలపై వేగంగా స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీని ఉపముఖ్యమంత్రి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *