రెండు దశాబ్దాల రోడ్డు వెతలకు పరిష్కారం చూపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

  • ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనలో వచ్చిన వినతులకు తక్షణ స్పందన
  • రూ. 7 కోట్ల 60 లక్షలతో రెండు రోడ్లు మంజూరు

ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని, ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలు చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపే చొరవ ప్రత్యేకమైనది. ముఖ్యంగా క్షేత్ర స్థాయి పర్యటనల్లో వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపుతున్నారు. ఇటీవల ఐ.ఎస్.జగన్నాథపురం పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా రెండు రోడ్ల నిర్మాణానికి రూ. 7 కోట్ల 60 లక్షలు మంజూరు చేయించారు. పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండల పరిధిలోని తిమ్మనకుంట – గవరవరం మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో ఆయా గ్రామాల ప్రజలు రెండు దశాబ్దాలుగా ప్రయాణ కష్టాలు అనుభవిస్తున్నారు.

ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనలో ఓ మహిళ బిడ్డను ఎత్తుకుని జనాన్ని తప్పించుకుంటూ ఆయన వద్దకు వచ్చి ఆ రోడ్డు దుస్థితిని వివరించారు. ఆ మహిళ ఆవేదనను విని చలించిపోయి, పల్లె పండగ 2.0లో భాగంగా సాస్కీ నిధులతో తిమ్మనకుంట – యర్రవరం రోడ్డు నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. 9 కి.మీ. రోడ్డు నిర్మాణం కోసం రూ. 7 కోట్లు మంజూరు చేశారు. దీంతో పాటు అదే నియోజకవర్గ పరిధిలో- యర్రంపేట గ్రామానికి చెందిన రైతుల కోరిక మేరకు పంట పొలాల మధ్యకు వెళ్లే 3 కిలోమీటర్ల డొంక రోడ్డు నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి రూ.60 లక్షలను మంజూరు చేయించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా,మార్కెటింగ్లో కీలకపాత్ర పోషించే డొంక రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *