మరో టాలీవుడ్ సినిమా లో పృథ్వీరాజ్ సుకుమారన్

టాలీవుడ్ ఎప్పుడూ ప్రతిభ ఉన్న నటులు, సాంకేతిక నిపుణులకు విస్తృత అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఇతర భాషల నుంచి వచ్చిన పలువురు నటులు తెలుగులో బలమైన పాత్రలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బహుముఖ ప్రతిభావంతుడైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చేరాడు.

సలార్, వారణాసి తర్వాత పృథ్వీరాజ్ తన మూడో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాని హీరోగా, ఓజీ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో పృథ్వీరాజ్‌కు కీలకమైన, కథకు బలం ఇచ్చే పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాత్కాలికంగా ‘బ్లడీ రోమియో’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా, సుజీత్ ట్రేడ్‌మార్క్ యాక్షన్ టచ్‌తో ఉండబోతుందని సమాచారం.

ఈ చిత్రంలో నానికి గట్టి ఆన్‌స్క్రీన్ పోటీగా పృథ్వీరాజ్ కనిపించనున్నారు. ముఖ్యంగా సుజీత్ ప్రతి ముఖ్య పాత్రకు కొత్త మేకోవర్ ఇవ్వడంలో దిట్ట కావడంతో, పృథ్వీరాజ్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అంచనాలు. రాబోయే సంవత్సరాల్లో టాలీవుడ్‌లో తన కెరీర్‌ను బలంగా నిలబెట్టుకునే దిశగా పృథ్వీరాజ్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో ప్రిథ్వీరాజ్ చేసిన పాత్ర తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని మంచి పేరు తీసుకొచ్చింది. తదుపరి ఆయన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసిలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు.

వారణాసిలో కుంభాగా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ — ఫ్యూచరిస్టిక్ సెటప్‌తో, భయంకరమైన, మెనేసింగ్ షేడ్స్‌తో — గత నెల విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన పొందింది. ఈ సినిమా ఆయన కెరీర్‌కు భారీ బూస్ట్ ఇచ్చి, అంతర్జాతీయంగా కూడా మరింత గుర్తింపు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *