మెట్రోను ప్రభుత్వం డీల్‌ చేయగలుగుతుందా?

హైదరాబాద్ నగర ప్రజల రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న మెట్రో ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియను 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు, అంటే మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి మెట్రో కార్యకలాపాలు పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి.

ఈ భారీ బదిలీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎల్ అండ్ టీ ఉన్నతాధికారులతో సమావేశమై ఆర్థిక, న్యాయ, సాంకేతిక అంశాలపై లోతుగా చర్చించింది. వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కావడంతో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం ఐడీబీఐ సంస్థను ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్‌గా నియమించింది. ఐడీబీఐ ఇప్పటికే సమగ్ర నివేదికను అందజేసినట్టు సమాచారం. దాని ఆధారంగానే హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ్ టీ మధ్య తుది ఒప్పందాలు కుదరనున్నాయి.

అదే సమయంలో మెట్రో నిర్మాణ నాణ్యత, రైళ్ల నిర్వహణ, ఆపరేషన్స్ వంటి అంశాలను సమీక్షించేందుకు టెక్నికల్ కన్సల్టెంట్‌ను కూడా నియమించనున్నారు. ఈ నివేదికలన్నీ కలిపి మెట్రో టేకోవర్‌కు స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం కానుంది. మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే టికెట్ ధరల నియంత్రణ, రెండో దశ విస్తరణకు వేగం, బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో మెరుగైన అనుసంధానం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ నిర్ణయం హైదరాబాద్ ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనాలను అందించే కీలక మలుపుగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *