తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. వేలాది మంది భక్తులు కాలినడకన అలిపిరి నుంచి లేదా రోడ్డు మార్గం ద్వారా వాహనాల్లో కొండకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, కరోనా సమయంలో దర్శనాలు నిలిపి వేయడంతో వన్యప్రాణులు, వన్యమృగాలు కీకారణ్యం నుంచి రోడ్డు, మెట్ల మార్గం గుండా ప్రయాణాలు సాగించాయి. జన సంచారం తగ్గిపోవడంతో చాలా ప్రాణాలు ఈ మార్గంలోనే ఎక్కువగా సంచరించినట్టుగా వీడియో ఫూటేజ్‌ల ద్వారా బయటకు వచ్చింది. అయితే, తాజాగా మరోసారి తిరుమల ఘాట్‌రోడ్డులో చిరుతపులి సంచారం చేస్తున్నట్టుగా భక్తులు చెబుతున్నారు.
మొదటి ఘాట్‌రోడ్డులో మార్గంలో డివైడర్ మీద నుంచి చిరుత పులి పరిగెడుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి కారులో నుంచి కెమెరాలో షూట్ చేశాడు. రాత్రి సమయం కావడంతో చిరుతలు ఆహారం కోసం అరణ్యాలను వదిలి జనసంచారం ఉండే ప్రాంతాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులను అటు అధికారులు అలర్ట్ చేశారు. తిరుమలకు వెళ్లే వాహనాల డోర్లు క్లోజ్ చేసుకొని వెళ్లాలని, మార్గమధ్యలో ఎక్కడా ఆగి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బయటకు రావొద్దని అంటున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్‌రోడ్డులో పులి పరిగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.