పాన్-ఇండియా స్థాయిలో చూస్తే 2025 సంవత్సరం టాలీవుడ్‌కు కొంత నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలు తెలుగు రాష్ట్రాల బయట ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. అదే సమయంలో కోలీవుడ్ మాత్రం రజనీకాంత్ నటించిన కూలీ సినిమాతో 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్ద సంఖ్యలను నమోదు చేయడం గమనార్హం.
కోవిడ్ తర్వాత టాలీవుడ్ ప్రతి సంవత్సరం వరుసగా పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్లు ఇచ్చింది. కానీ 2025 మాత్రం ఆ ట్రెండ్‌కు మినహాయింపుగా మారింది. OG, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, భారీ హైప్ ఉన్న గేమ్ చేంజర్, అఖండ 2 వంటి పాన్-ఇండియా సినిమాలు ఉత్తర భారతంలో ఘోరంగా విఫలమయ్యాయి.
ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ అనూహ్యంగా భారత బాక్సాఫీస్‌ను ఏలింది. ఛావా, సయ్యారా, తాజాగా సంచలనం సృష్టించిన ధురంధర్ వంటి సినిమాలు అంచనాలకు మించి భారీ వసూళ్లతో దూసుకుపోయాయి.
అయితే ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం 2026పై ఉంది. ఇటీవలికాలంలోనే అత్యంత ఆసక్తికరమైన సంవత్సరాల్లో ఒకటిగా 2026 మారనుంది. పాన్-ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ లిస్ట్‌లో ముందుగా నిలిచేది ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ డ్రామా ది రాజా సాబ్.
అదే విధంగా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో:
*పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్
*ఎన్టీఆర్ – నీల్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ డ్రామా డ్రాగన్ (రూమర్డ్ టైటిల్),
*రామ్ చరణ్ నటిస్తున్న రస్టిక్ యాక్షనర్ పెద్ది,
*నాని ‘ది ప్యారడైస్’,
*మెగాస్టార్ చిరంజీవి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘విశ్వంభర’,
*ప్రభాస్ నటిస్తున్న యుద్ధ నేపథ్య చిత్రం ‘ఫౌజీ’ ఉన్నాయి.
ఇవే కాకుండా ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ కూడా 2026 విడుదల రేసులో ఉందని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్, నిఖిల్ నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘స్వయంభూ’ కూడా పాన్-ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న సినిమాలే.