రమ్మని పిలుస్తున్న విశాఖ గ్లాస్‌ స్కైవాక్‌

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగానికి మరో కొత్త ఆకర్షణ చేరింది. తూర్పు తీరపు రత్నం అని పేరుగాంచిన విశాఖపట్నం, సముద్రం – కొండలు – పచ్చదనం – చరిత్ర అనే నాలుగు వైవిధ్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో “గ్లాస్‌ స్కైవాక్‌” అనే అద్భుతం చేరింది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ స్కైవాక్‌ గురించి తెలుసుకునేందుకు విశాఖ వాసులతో పాటు దేశంలోని పర్యాటకులు కూడా ఉత్సాహం చూపుతున్నారు.

కైలాసగిరి పై కొత్త అందం

విశాఖ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది కైలాసగిరి. ఆ పర్వతంపై ఆదిదంపతులైన శివపార్వతుల విగ్రహం ఓ అద్భుతం. పచ్చని కొండపై వేంచేసిన ఆదిదంపతలను దర్శించుకునేందుకు నిత్యం వందలాదిమంది వస్తుంటారు. కొండపైభాగానికి చేరుకునేందుకు నిర్మించిన రోప్‌వే ఏర్పాటు చేయడంతో నడవలేనివాళ్లు కూడా కైలాసగిరికి వచ్చి విశాఖ అందాలను వీక్షిస్తున్నారు. కైలాసగిరి నుంచి చూస్తే విశాఖ బీచ్‌ అత్యద్భుతంగా కనిపిస్తుంది. కాగా, దీనికి ఇప్పుడు గ్లాస్‌ స్కైవాక్‌ కూడా తోడు కాబోతుండటంతో మరింతమంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు సిద్దమౌతున్నది. భూమి నుంచి 262 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ గ్లాస్‌ స్కైవాక్‌పై నడుస్తూ ఉంటే… రోమాలు నిక్కబొడుచుకుంటాయి కదా. గుండే జారిపోతుంది కదా.

ప్రపంచ రికార్డులకు దగ్గరగా

విశాఖలో నిర్మించిన స్కైవాక్‌ ఎత్తు 262 మీటర్లు. అయితే, చైనాలోని జాంగ్జియాజే ప్రాంతంలో ఉన్న స్కైవాక్‌ 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పొడవు 430 మీటర్లు. ఇదే ఎత్తైన గ్లాస్‌ బ్రిడ్జి అయినప్పటికీ, విశాఖ కైలాసగిరిపై ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్‌ కూడా ఇంచుమించుగా జాంగ్జియాజే మాదిరిగానే ఆకట్టుకుంటుందని పర్యాటకులు చెబుతారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విశాఖ పట్నం పర్యాటక రాజధానిగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆనంద్‌ మహేంద్ర వంటి బిజినెస్‌ పర్సన్స్‌ కూడా ఈ విశాఖ గ్లాస్‌ స్కైవాక్‌పై ఆసక్తి చూపుతున్నారు. తనకు ఎత్తైన ప్రదేశాలంటే భయమని, కానీ, ఇలాంటి వాటిని మిస్‌ కావడం కొంత ఇబ్బందికరమైన అంశమేనని, తాను ఇంట్లోనే కూర్చొని ఇలాంటి వాటిని వీక్షిస్తూ, తనకు తెలిసిన అంశాలను వీక్షకులతో పంచుకుంటానని ఆనంద్‌ మహేంద్ర ట్వీట్‌ చేశాడు.

నిర్మాణ ప్రత్యేకతలు

దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్‌ ప్లేట్‌లను వినియోగించారు. భూకంపం లేదా బలమైన గాలుల ప్రభావాన్ని తట్టుకునేలా డిజైన్ చేశారు. ఒకేసారి వందలాది మంది పర్యాటకులు వెళ్ళగలిగేలా విస్తృతంగా నిర్మించారు. రాత్రివేళల్లో స్కైవాక్ చుట్టూ లైట్ డెకరేషన్ ఉండటంతో ఒక మాంత్రిక అనుభూతిని ఇస్తుంది.

భయమా? సాహసమా?

ఎత్తులంటే భయం ఉన్నవారికి ఇది కొంచెం సవాలు కావచ్చు. గాజుపై నడుస్తూ కింద కనిపించే లోతైన లోయ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కానీ అదే సమయంలో సాహసప్రియులకు ఇది ఒక అద్భుత అనుభవం అవుతుంది. “ఒకసారి అయినా ఈ అనుభవం పొందాలి” అనే ఆసక్తి కలిగించేలా ఈ స్కైవాక్ ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

  • విమాన మార్గం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కైలాసగిరి కేవలం 15 కి.మీ. దూరంలోనే ఉంది.
  • రైల్వే: విశాఖ రైల్వే స్టేషన్ నుండి కైలాసగిరి కి 8 కి.మీ. ప్రయాణం.
  • రోడ్ మార్గం: బస్సులు, క్యాబ్స్, ఆటోలు సులభంగా లభిస్తాయి.

ఎప్పుడూ వెళ్లాలి?

  • శీతాకాలం (అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు) ఉత్తమ సమయం.
  • ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం వేళ స్కైవాక్ పై నడవడం మరింత మధుర అనుభవాన్ని ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *