పెళ్లి వేడుకలకు ఇన్సూరెన్స్ – కొత్త ట్రెండ్

భారతదేశంలో పెళ్లి వేడుకలు ఎప్పటినుంచో సంప్రదాయం, సంస్కృతి, ఆచారాల కలయికగా ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి. అయితే కాలం మారుతున్నకొద్ది, పెళ్లిళ్లు కూడా మరింత వైభవంగా, ఖరీదుగా మారాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ వెడ్డింగ్స్, గ్రాండ్ రిసెప్షన్స్‌ వంటి కార్యక్రమాలపై లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుంటారు. ఈ భారీ వ్యయాల నేపథ్యంలో ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థిక నష్టం భారీగా ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లోకి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనే కొత్త ట్రెండ్ ప్రవేశించింది.

వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనేది వివాహ వేడుకలో జరిగే అనూహ్య సంఘటనల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని కవర్ చేసే ప్రత్యేక ఈవెంట్ బీమా. అకస్మాత్తుగా పెళ్లి వాయిదా పడటం, రద్దు కావడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, అగ్నిప్రమాదం, కుటుంబ అత్యవసర పరిస్థితులు, డెకరేషన్ లేదా కేటరింగ్ వంటి సేవలు అందకపోవడం వంటి సమస్యల వల్ల కలిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. అదేవిధంగా పెళ్లి సమయంలో దొంగతనం, అతిథులకు అయ్యే ప్రమాదాలు లేదా వైద్య ఖర్చులనూ ఇందులో కవర్ చేస్తారు.

ప్రీమియమ్ పరంగా ఇది చాలా అందుబాటులో ఉంటుంది. సాధారణంగా బీమా విలువలో 0.2% నుండి 0.4% మధ్య చెల్లిస్తే సరిపోతుంది. అయితే యుద్ధం, ఉగ్రవాదం, పౌర అశాంతి, స్వీయ హాని వంటి కారణాల వల్ల జరిగిన నష్టాలు మాత్రం కవరేజ్‌కి అర్హం కావు. మొత్తం మీద వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పెళ్లి వేడుకలను మరింత భద్రతతో, ఆర్థికంగా రక్షణతో జరిపేందుకు కొత్త మార్గాన్ని చూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *