భారత్‌ మిషన్‌ 40 సక్సెస్‌ అవుతుందా?

భారత్‌ అమెరికా మధ్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరిలో జమ్ముకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడిచేసి 20 మంది టూరిస్టులను చంపేయడంతో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. మతం అడిగి మరీ దాడి చేయడంతో పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాక్‌ ఉగ్రవాదులపై దాడి చేసింది. ఈ భీకర దాడులు మరింత ఉదృతం చేయాలని అనుకున్నా… భారత్‌ టార్గెట్‌ పూర్తి కావడంతో ఆపరేషన్‌ను నిలిపివేసింది. అయితే, భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని, తన కృషి వలనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముగిసిందని ట్రంప్‌ ప్రకటించాడు.

పాకిస్తాన్‌ ఆర్మీజనరల్‌ మునీర్‌ అమెరికా వెళ్లి ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా, ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడని ప్రకటించాడు. ఈ విధమైన చర్యలే భారత్‌ నుంచి కూడా ఉంటాయని ట్రంప్‌ భావించాడు. కానీ, మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా భారత్‌ కృషి కారణంగానే ఉగ్రవాదులను నిర్మూలించామని, ఈ విషయంలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్‌ స్పష్టం చేసింది. దీంతో భారత్‌పై చర్యలు తీసుకొనేందుకు ట్రంప్‌ సిద్ధం కావడం, 50 శాతం టారిఫ్‌లు విధించాడు. ఈ టారిఫ్‌లతో భారత్‌ దిగొస్తుందని భావించాడు. కానీ, భారత్‌ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. అవసరమైతే అమెరికాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పింది.

చెప్పడమే కాదు, భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్త్రాలను ఆ దేశానికి కాకుండా ఇతర దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మిషన్‌ 40ని సిద్ధం చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో పాటు, భారత్‌కు మిత్రపక్షాలుగా ఉన్న దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత విస్తరింపజేయడమే ఈ మిషన్‌ 40 ప్రధానుద్దేశం. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఇప్పటికే ఆయుధాల దిగుమతిని చాలా వరకు తగ్గించేసింది. భారత్‌కు అవసరమైన ఆయుధాలను సొంతంగానే దేశంలో తయారు చేసుకుంటోంది. అంతేకాదు, బ్రహ్మోస్‌ క్షిపణులు, తేజస్‌ యుద్ధ విమానాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నది.

40 దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్‌ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది. అంతేకాకుండా, ఇప్పుడు రష్యా-చైనాలతో కూడా భారత్‌ వాణిజ్య, సహకార బంధాలను బలోపేతం చేసుకునేందుకు సిద్దమౌతున్నది. రష్యాతో ఇప్పటికే బంధం బలపడింది. ముడిచమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడంతో పాటు ఆ దేశానికి అవసరమైన మ్యాన్‌పవర్‌ను కూడా భారత్‌ ఎగుమతి చేస్తున్నది. తాజాగా చైనాలో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సు ద్వారా వ్యాపార, వాణిజ్య సంబంధాలను వ్యాప్తి చేసుకునే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు. కొద్దిసేపటి క్రితమే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిగిన చర్చలు కూడా ఈ దిశగానే జరిగినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *