అంతరిక్షంలో గనుల తవ్వకం అనేది ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన కల్పిత ఆలోచనగా భావించేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు చూస్తే, ఇది సమీప భవిష్యత్తులో నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రతిష్టాత్మక శాస్త్రీయ జర్నల్ మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, అంతరిక్షంలోని గ్రహశకలాల నుంచి విలువైన లోహాలు, నీటిని సేకరించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూమిపై సహజ వనరులు వేగంగా తరుగుతున్న నేపథ్యంలో, శాస్త్రవేత్తల దృష్టి ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న గ్రహశకలాల వైపు మళ్లింది. ఈ శకలాల్లో బంగారం, ప్లాటినం వంటి ఖరీదైన లోహాలతో పాటు, మానవ మనుగడకు అత్యంత అవసరమైన నీటి భారీ నిల్వలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి.
స్పానిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, అన్ని గ్రహశకలాలు గనుల తవ్వకాలకు అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా ‘కార్బనేషియస్ కొండ్రైట్స్’ అనే రకానికి చెందిన గ్రహశకలాలు అత్యంత ఆశాజనకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ శకలాల్లో లభించే నీటికి అంతరిక్షంలో అత్యంత విలువ ఉంటుంది. ఈ నీటిని కేవలం తాగడానికి మాత్రమే కాకుండా, హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడదీసి రాకెట్ ఇంధనంగా కూడా వినియోగించవచ్చు. దీని ద్వారా భూమి నుంచి భారీగా ఇంధనం మోసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
అయితే, అంతరిక్ష గనుల తవ్వకం అంత సులభమైన పని కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ గురుత్వాకర్షణ, భారీ సాంకేతిక సవాళ్లు, అధిక వ్యయం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ, స్టార్‌షిప్ వంటి ఆధునిక భారీ రాకెట్లతో ప్రయోగ ఖర్చులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం ఉందని అంచనా. వ్యాపార లాభాలతో పాటు, భూమికి ముప్పుగా మారే ప్రమాదకర గ్రహశకలాల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా భూమికి రక్షణ కల్పించే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది విజయవంతమైతే, మానవజాతి చరిత్రలో ఒక కొత్త సాంకేతిక యుగం ప్రారంభమైనట్లేనని నిపుణుల అభిప్రాయం.