బాబోయ్… ఒక్కో చీర ఖరీదు లక్షల్లో ఉన్నా, మైసూర్ సిల్క్ కోసం జనం చూపిస్తున్న ఉత్సాహం అంతా ఇంతా కాదు. తెల్లవారుజామున నాలుగు గంటలకే బెంగళూరులోని కేఎస్‌ఐసీ (KSIC) ప్రభుత్వ షోరూమ్ వద్ద మహిళలు, కుటుంబాలు బారులు తీరారు. చలి లెక్కచేయకుండా, గంటల తరబడి క్యూలో నిలబడి మరీ తమ వంతు కోసం ఎదురుచూశారు. కారణం ఒక్కటే… అసలైన ప్యూర్ మైసూర్ సిల్క్ చీర.
ఈ షోరూమ్‌లో లభిస్తున్న చీరల ధరలు సాధారణంగా రూ.23 వేల నుంచి ప్రారంభమై, డిజైన్, నాణ్యతను బట్టి రూ.2 లక్షలు, రూ.2.5 లక్షల వరకు ఉన్నాయి. ధర ఎంత ఉన్నా, నాణ్యత విషయంలో రాజీపడలేమని కొనుగోలుదారులు చెబుతున్నారు. మార్కెట్‌లో నకిలీ సిల్క్, మిక్స్‌డ్ ఫాబ్రిక్ చీరలు పెరిగిపోవడంతో, ప్రభుత్వ సంస్థ అయిన కేఎస్‌ఐసీపై నమ్మకం పెట్టుకున్నారు.
అసలైన మైసూర్ సిల్క్‌కు ప్రత్యేకమైన మెరుపు, బరువు, దీర్ఘకాలిక మన్నిక ఉండటంతో పాటు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఇవే సరైన ఎంపికగా మారాయి. ముఖ్యంగా పెళ్లి సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కొందరు అయితే నెలల ముందే పొదుపు చేసి మరీ ఈ చీర కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.
అధిక రద్దీ కారణంగా షోరూమ్ అధికారులు టోకెన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క టోకెన్‌కు ఒక్క చీర మాత్రమే విక్రయిస్తున్నారు. దీంతో గందరగోళం తగ్గడమే కాకుండా, ఎక్కువ మందికి అవకాశం దక్కుతోంది. భద్రత, క్రమశిక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
ధరలు లక్షల్లో ఉన్నా, “నిజమైన సిల్క్ అయితే చాలు” అన్న భావనతో మైసూర్ సిల్క్ చీరల కోసం ప్రజలు చూపిస్తున్న ఆసక్తి… ఈ సంప్రదాయ వస్త్రానికి ఉన్న విలువను మరోసారి చాటుతోంది.