పచ్చని కోనసీమ అంటేనే పచ్చని పొలాలు, నదీ ప్రవాహాలు, ప్రశాంత గ్రామీణ జీవితం గుర్తుకు వస్తాయి. కానీ అదే కోనసీమలో చమురు, సహజ వాయు అన్వేషణ పేరుతో తరచూ అగ్గిరవ్వలు చెలరేగుతూ ప్రజల గుండెల్లో భయాన్ని నింపుతున్నాయి. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీకి చెందిన మోరి–5 బావి వద్ద సంభవించిన భారీ బ్లోఅవుట్ మరోసారి ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ప్రాణనష్టం జరగకపోయినా, భారీ మంటలు ఎగసిపడటం, గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడం కోనసీమలో గ్యాస్ ప్రమాదాల చరిత్రను మరోసారి గుర్తు చేసింది. ఇది మొదటిసారి కాదు.
1992లో మామిడికుదురు మండలం కొమరాడలో గ్యాస్ బ్లోఅవుట్ జరిగి కొబ్బరి తోటలు దగ్ధమయ్యాయి. 1995లో పాశర్లపూడిలో డ్రిల్లింగ్ సమయంలో జరిగిన గ్యాస్ లీక్ 65 రోజుల పాటు మండుతూనే ఉండి, వేలాది కుటుంబాలను వలసబాట పట్టించింది. 1997లో దేవరపల్లి సమీపంలోని పిఠానివారిపాలెంలో గ్యాస్ మంటలు వంద మీటర్ల ఎత్తుకు ఎగసిపడి, 400 కుటుంబాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. 2014లో నగరం వద్ద గెయిల్ పైప్‌లైన్ పేలుడు దేశాన్ని కుదిపేసింది. 23 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన కోనసీమ ప్రజలకు మరిచిపోలేని విషాదం. 2020లో ఉప్పూడిలో గ్యాస్ లీక్ రెండు రోజుల పాటు ప్రజలను వణికించింది.
2025లో తాండవపల్లిలో బ్లోఅవుట్ సంభవించి మంటలు చెలరేగాయి. ఇప్పుడు 2026 ప్రారంభంలోనే ఇరుసుమండ ఘటన చోటుచేసుకుంది. ఈ వరుస ఘటనలు కృష్ణా–గోదావరి బేసిన్‌లో జరుగుతున్న చమురు, గ్యాస్ అన్వేషణల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ కార్యకలాపాలు పచ్చని కోనసీమను నిప్పుల కొలిమిగా మార్చుతున్నాయా అనే ఆందోళన ప్రజల్లో పెరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు, పారదర్శకత, ప్రజల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోనసీమ ప్రజలు కోరుకుంటున్నారు.