సంక్రాంతి పండుగ అంటే ఇళ్లలో సందడి, బంధువుల సందర్శన, రుచికరమైన వంటకాలే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఈ పండుగ వేళ చికెన్, మటన్ వంటివి వండకుండా ఉండే కుటుంబాలు చాలా తక్కువ. గ్రామాల్లో అయితే నాటుకోడి వంటకం సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు, గ్రామ దేవతలకు నాటుకోడితో మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఈసారి అదే నాటుకోడి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద షాక్ ఇస్తోంది.
పండుగ సీజన్ రావడంతో నాటుకోళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణ రోజుల్లో కేజీ నాటుకోడి రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది. కానీ ఇప్పుడు అదే నాటుకోడి కేజీ ధర రూ.2,000 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఈ ధరలు చూసి పండుగకు నాటుకోడి వండుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
గోదావరి జిల్లాలు, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో అక్కడ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక పందెం కోళ్ల ధరలు అయితే లక్షల రూపాయల వరకూ వెళ్తుండటం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ వంటి నగరాల్లో కేజీ నాటుకోడి ధర రూ.600 నుంచి రూ.1,000 వరకు ఉంది. గ్రామాలతో పోలిస్తే నగరాల్లో కొంత తక్కువగా ఉన్నా, సామాన్యులకు మాత్రం ఇవి కూడా భారంగానే మారుతున్నాయి.
నాటుకోడి మాత్రమే కాదు… బాయిలర్ చికెన్ ధరలు కూడా పెరిగాయి. గత నెలలో రూ.230గా ఉన్న స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర ఇప్పుడు రూ.340కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో ఇదే పరిస్థితి. ఏపీలో కొన్ని జిల్లాల్లో రూ.300 వరకు పలుకుతోంది. పండుగ సమీపిస్తున్న కొద్దీ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పాల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.
దాణా ఖర్చులు, ఫారమ్ నిర్వహణ వ్యయాలు పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వారు వివరిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఇదే ధరలు కొనసాగే అవకాశముందని అంచనా. ఇటు మటన్ ధర కూడా కేజీకి రూ.800 నుంచి రూ.900 వరకు ఉండటంతో, ఈసారి సంక్రాంతి విందు జేబులపై భారీ భారం వేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.