ప్రపంచం మొత్తం దేశాల సరిహద్దులతో, పాస్‌పోర్ట్ ముద్రలతో, చట్టాల గోడలతో నిండిపోయిందని మనం అనుకుంటాం. కానీ… ఈ భూమిపై మాత్రం ఏ దేశానికీ చెందని ఒక విచిత్రమైన ప్రదేశం నిజంగానే ఉంది. అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు, పాస్‌పోర్ట్ అడగరు, ప్రభుత్వ చట్టాలు కూడా అమలులో ఉండవు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది కల కాదు – నిజం. ఆ ప్రదేశం పేరు బీర్ తావిల్.
ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ – సూడాన్ దేశాల మధ్య విస్తరించి ఉన్న ఈ ఎడారి ప్రాంతం దాదాపు 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నగరాలు లేవు, గ్రామాలు లేవు, శాశ్వత జనాభా అసలే లేదు. అన్నిటికంటే ఆశ్చర్యకరం… ఇది అధికారికంగా ఏ దేశానికీ చెందదు.
దీనికి కారణం వలస పాలన కాలం నాటి ఒక సరిహద్దు గందరగోళం. 1899లో బ్రిటిష్‌లు గీసిన సరిహద్దు ప్రకారం బీర్ తావిల్ సూడాన్‌లో భాగమైంది. కానీ 1902లో పరిపాలనా సౌలభ్యం కోసం గీసిన మరో రేఖ ప్రకారం అది ఈజిప్ట్‌లోకి వెళ్లింది. ఇప్పటికీ ఈజిప్ట్ 1899 సరిహద్దునే అంటుకుంటోంది, సూడాన్ మాత్రం 1902 సరిహద్దునే పట్టుకుంది. ఫలితం? రెండూ బీర్ తావిల్‌ను వదిలేసి, పక్కనే ఉన్న వనరులతో నిండిన హలాయిబ్ ట్రయాంగిల్‌పై మాత్రమే దృష్టి పెట్టాయి.
ఈ చట్టపరమైన ఖాళీ కొందరిని కలల ప్రపంచంలోకి లాగింది. 2014లో ఓ అమెరికన్ వ్యక్తి అక్కడ జెండా ఎగురవేసి “కింగ్డమ్” ప్రకటించాడు. 2017లో ఒక భారతీయుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో ఈ కథలు వైరల్ అయ్యాయి. కానీ వాస్తవం ఏమిటంటే… జెండా పాతితే దేశం అవదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం జనాభా, ప్రభుత్వం, గుర్తింపు అన్నీ అవసరం.
అలా బీర్ తావిల్ ఈ రోజుకీ భూమిపై ఉన్న ఏకైక ‘నో మ్యాన్స్ ల్యాండ్’లా నిలిచిపోయింది. దేశాలు పోరాడుతున్న ప్రపంచంలో… ఎవరికీ అవసరం లేని భూమి కూడా ఉందని గుర్తు చేసే విచిత్రమైన ఉదాహరణగా.
గ్రీన్లాండ్ కావాలని కోరుకుంటున్న ట్రంప్‌కు ఈ విషయం తెలుసో లేదో ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా. అమెరికా దేశాన్ని ఆఫ్రికాలో విస్తరించడానికి బీర్తావిల్ను సొంతం చేసుకోవచ్చు కదా.