భారతీయ రైల్వేలో మరో కీలక మైలురాయిగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్‌గా పేరొందిన వందే భారత్ రైళ్లకు స్లీపర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ రైలు, సుదూర రాత్రి ప్రయాణాలకు అనుకూలంగా పూర్తిగా ఏసీ సౌకర్యాలతో రూపుదిద్దుకుంది.
2026 జనవరిలో దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. గౌహతి–కోల్‌కతా మార్గంలో తొలి సర్వీస్ నడపనుండగా, ఈ రైలు అస్సాం, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. మొత్తం 16 కోచ్‌లతో 823 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ రైలులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి.
గౌహతి–కోల్‌కతా మధ్య ప్రయాణ ఛార్జీలు ఏసీ 3-టైర్‌కు రూ.2,300, ఏసీ 2-టైర్‌కు రూ.3,000, ఫస్ట్ క్లాస్‌కు రూ.3,600గా ఉండే అవకాశం ఉంది. ఇటీవల నిర్వహించిన స్పీడ్ ట్రయల్స్‌లో 180 కి.మీ. వేగంతో ప్రయాణించినప్పటికీ నీటితో నిండిన గ్లాసులు కదలకపోవడం ఈ రైలు అత్యాధునిక సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది.