విమానాల్లో పవర్‌ బ్యాంక్‌లపై నిషేధం ఎందుకంటే

Why Power Banks Are Banned on Flights DGCA Safety Guidelines Explained

విమానాల్లో పవర్‌ బ్యాంక్‌లపై నిషేధం విధించడంవెనుక బలమైన భద్రతా కారణాలున్నాయి. విమాన ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే పవర్ బ్యాంక్‌లు లిథియం అయాన్ బ్యాటరీలతో తయారవుతాయి. ఈ బ్యాటరీలు హై ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉండటంతో చిన్న లోపం జరిగినా తీవ్ర అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా “థర్మల్ రన్‌అవే” అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే బ్యాటరీ అకస్మాత్తుగా వేడెక్కి పేలిపోవచ్చు.

అధిక ఛార్జింగ్, తయారీ లోపాలు, ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్లు, నలిగిపోవడం లేదా తప్పు వినియోగం వంటివి లిథియం బ్యాటరీ మంటలకు ప్రధాన కారణాలు. సాధారణ మంటలలా ఇవి తేలికగా ఆర్పలేము. లిథియం బ్యాటరీ మంటలు స్వయం సమృద్ధిగా కొనసాగుతాయి, అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తాయి, పేలుళ్లకూ దారి తీస్తాయి. విమానంలో ఇటువంటి మంటలు చెలరేగితే ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విమానాల్లో పవర్ బ్యాంక్‌లు, ఇతర లిథియం బ్యాటరీ పరికరాల వల్ల జరిగిన అగ్ని ప్రమాద ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అన్ని ఎయిర్‌లైన్స్‌, విమానాశ్రయ నిర్వాహకులకు సేఫ్టీ అడ్వైజరీ జారీ చేసింది. తాజా గైడ్‌లైన్స్ ప్రకారం, విమానంలో పవర్ బ్యాంక్‌లను ఛార్జ్ చేయడం పూర్తిగా నిషేధం. సీటు వద్ద ఉన్న పవర్ సాకెట్లకు పవర్ బ్యాంక్‌ను కనెక్ట్ చేయరాదు. పవర్ బ్యాంక్‌లను చెక్-ఇన్ బ్యాగేజీలో లేదా ఓవర్‌హెడ్ బిన్‌లో ఉంచకూడదు. ప్రయాణికులు వాటిని తప్పనిసరిగా హ్యాండ్ లగేజీలోనే తీసుకెళ్లాలి. అలాగే 100 వాట్-అవర్స్ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌లకే అనుమతి ఉంటుంది. లిథియం బ్యాటరీల రవాణాకు సంబంధించిన రిస్క్ అసెస్‌మెంట్‌ను పునఃసమీక్షించాలనీ, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలనీ DGCA ఎయిర్ ఆపరేటర్లను ఆదేశించింది. ప్రయాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా తీసుకుని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో విమానాల్లో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *