చలికాలం మొదలయ్యిందంటే… పాములు ఒక్కసారిగా కనిపించకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి దీని వెనుక భయం కాదు, శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. నిపుణులు చెప్పేదేమిటంటే పాములు చల్లని రక్త జంతువులు. అంటే మనుషుల్లా లేదా ఇతర జంతువుల్లా శరీర ఉష్ణోగ్రతను అవే నియంత్రించుకునే సామర్థ్యం వాటికి ఉండదు. బయట వాతావరణ ఉష్ణోగ్రత ఎలా ఉంటే, పాముల శరీర స్థితీ అలాగే మారిపోతుంది.
చలి ఎక్కువైనప్పుడు పాముల శరీర జీవక్రియ మందగిస్తుంది. రక్తప్రసరణ తగ్గిపోతుంది. కదలడం, వేగంగా స్పందించడం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో అవి బయట తిరగడం కన్నా, సురక్షితమైన వెచ్చని ప్రాంతాల్లో దాక్కోవడానికే ఇష్టపడతాయి. అందుకే గడ్డివాములు, కట్టెల కుప్పలు, ధాన్య గోదాములు, పాత ఇళ్ల మూలలు లేదా భూమి లోపల ఉన్న చీలికలు పాములకు ఆశ్రయంగా మారతాయి.
చలికాలంలో పాములు పూర్తిగా చురుకుగా ఉండవు. రోజుకు 20 నుంచి 22 గంటల వరకు నిద్రాణస్థితిలో ఉంటాయి. ఆకలి ఉన్నా వేటాడే శక్తి లేకపోవడంతో చాలా తక్కువగా కదులుతాయి. అయితే ఈ సమయంలో అవి ప్రమాదకరం కాదని భావించడం పెద్ద పొరపాటు. చలి కారణంగా పాములు సహజంగానే చిరాకుగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం అనిపిస్తే, ఆత్మరక్షణ కోసం కాటు వేయడంలో వెనుకాడవు. అంతేకాదు, సాధారణ రోజుల కంటే ఎక్కువ విషాన్ని విడుదల చేసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి చలికాలంలోనూ పాముల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇళ్ల చుట్టూ చెత్త, కట్టెలు పేరుకుపోకుండా చూసుకోవడం, చీకటి మూలల్లో చేతులు పెట్టకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం. చిన్న అప్రమత్తతే పెద్ద ప్రమాదాన్ని నివారించగలదని గుర్తుంచుకోవాలి.