Native Async

కాంతారా ఇష్యూ పైన స్పందించిన రిషబ్ శెట్టి…

Rishab Shetty Reacts to Ranveer Singh’s Kantara Controversy: “Imitating Divine Elements Is Uncomfortable”
Spread the love

గత నెల గోవాలో జరిగిన IFFI ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. అయితే ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఆ సందర్భం లో రణవీర్ కాంతారా సినిమాలో ‘దేవి చాముండిని’ అనుకరించిన విధానం కన్నడిగులు ఇంకా హిందూ ప్రేక్షకులలో కొందరికి నచ్చలేదు.

స్టేజ్‌పైకి రాకముందే, ఇలాంటి హావభావాలు చేయవద్దని రిషబ్ శెట్టి రణ్‌వీర్‌కు సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ, రణ్‌వీర్ స్టేజి పైన ఉన్న ఉత్సాహంలో అనుకోకుండా చేసాడు. అది సానుకూల ఉద్దేశంతో చేసినా, భక్తి భావాలు చాలా సున్నితమైనవని, ఇలాంటి ప్రదర్శనలు సులభంగా మనోభావాలను దెబ్బతీస్తాయని నెటిజన్లు విమర్శించారు.

అంతేకాదు, ఆ సమయంలో దేవి చాముండిని ‘female ghost’ అని వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.

ఈ వివాదం తర్వాత రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణలు తెలిపారు. ఎలాంటి సంస్కృతి లేదా సంప్రదాయాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని, తన చర్యల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలంటూ పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ అంశంపై రిషబ్ శెట్టి స్పందించారు. అయితే ఆయన రణ్‌వీర్ సింగ్ పేరు నేరుగా ప్రస్తావించలేదు. కొన్ని రోజుల క్రితం చెన్నైలో జరిగిన Behindwoods ఈవెంట్‌లో మాట్లాడిన రిషబ్, స్టేజ్‌లపై, రీల్స్‌లో లేదా సోషల్ మీడియాలో దైవ సంబంధిత అంశాలను అనుకరించడం సరైంది కాదని స్పష్టంగా చెప్పారు.

ఇలాంటి చర్యలు తనకు అసౌకర్యంగా అనిపిస్తాయని తెలిపారు. అలాగే, కాంతారా టీమ్‌గా ఎన్నిసార్లు ప్రజలను దేవతల సూచనలను సరదాగా అనుకరించవద్దని కోరామని కూడా వెల్లడించారు.

ఈ సంఘటన మరోసారి ఒక విషయం గుర్తు చేస్తోంది. మంచి ఉద్దేశంతో చేసిన ప్రశంస కూడా కొన్నిసార్లు పెద్ద వివాదంగా మారవచ్చు. ముఖ్యంగా భక్తి, సంస్కృతి, విశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో నటులు మరియు సెలబ్రిటీలు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌పై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఇది ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit