ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌ సీరియస్‌…

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలకమైన పల్లె పోరు ముగిసింది. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఊహించినదానికంటే భారీ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోవడం ద్వారా సామాన్యుడి తీర్పు కాంగ్రెస్ వైపే ఉందని స్పష్టమైంది. 12,733 పంచాయతీల్లో దాదాపు ఏడువేలకుపైగా స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడటం పార్టీకి బలాన్ని ఇచ్చింది.

31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా, ఒక్క సిద్ధిపేట జిల్లా మినహా మిగతా 30 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేయడం విశేషం. అయితే ఈ విజయంపై అతిగా ఉత్సాహపడకుండా, పార్టీ అంతర్గత లోపాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.

ఫలితాలపై నిర్వహించిన సమీక్షలో కొందరు ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా రెబల్స్‌ను సమన్వయం చేయడంలో వైఫల్యం, బంధు ప్రీతికి పాల్పడటం వంటి అంశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీ గెలిచినా, క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు తప్పవని రేవంత్ హెచ్చరించారు.

అధికారంలో ఉండటం గర్వానికి కాదు, బాధ్యతకు గుర్తు అని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ విజయం కాంగ్రెస్‌కు బలం అయితే, అదే సమయంలో పార్టీ ప్రక్షాళనకు దిశానిర్దేశం చేసిన సంకేతంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *