అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు నిమిషాల వ్యవధిలోనే భారీగా పతనమవడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తున్న వెండి ధర ఒక్కసారిగా కరెక్షన్‌కు గురవడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా సిల్వర్ ఈటీఎఫ్ చార్టుల్లో ఈ పతనం స్పష్టంగా కనిపించింది. డిసెంబర్ 29 సోమవారం నిప్పాన్ ఇండియా ETF Silver BeES లైవ్ ట్రాకింగ్‌లో వెండి ధర కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 10 నుంచి 15 శాతం వరకు పడిపోయినట్లు గమనించవచ్చు. SILVERBEES ఒక యూనిట్ ధర రూ.235–240 స్థాయిల నుంచి నేరుగా రూ.215 నుంచి రూ.200 దిగువకు క్రాష్ కావడం ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసింది. నిపుణుల అంచనాల ప్రకారం ఈ అకస్మాత్తు పతనానికి ప్రధాన కారణం ప్యానిక్ సెల్లింగ్ మరియు భారీ ప్రాఫిట్ బుకింగ్ కావచ్చని చెబుతున్నారు.
ఇప్పటికే వెండి ధర ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరుకుందని, ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకిన తర్వాత పెద్ద ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించడంతో ఈ కరెక్షన్ చోటుచేసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2025లో ఇప్పటివరకు వెండి ధర దాదాపు 170 శాతం పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా ఒక ఔన్స్ వెండి ధర 77 డాలర్ల స్థాయిని తాకగా, 80 డాలర్ల మార్క్ వైపు దూసుకెళ్తున్న సమయంలోనే ఈ అమ్మకాలు మొదలయ్యాయి.
రాయిటర్స్ వార్తా సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలో ఈ పతనం తాత్కాలిక ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే జరిగిందని పేర్కొంది. అయితే పారిశ్రామిక వినియోగంలో వెండికి డిమాండ్ పెరగడం, సరఫరాలో కొరత ఉండడం వంటి బలమైన ఫండమెంటల్స్ భవిష్యత్తులో వెండి ధరలకు మద్దతుగా నిలుస్తాయని విశ్లేషణలో వెల్లడించింది. ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో వెండి ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.