విజయ్ సేతుపతి నటిస్తున్న ‘గాంధీ టాక్స్’ ఆధునిక సినీ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన థియేట్రికల్ అనుభవంగా నిలవబోతోందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్కు ఇది తొలి దర్శకత్వ ప్రయత్నం కావడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అరవింద్ స్వామి, అదితి రావు హైదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 2026 జనవరి 30న దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలిపే అంశం ఏంటంటే… ఇది పూర్తిగా సైలెంట్ ఫిల్మ్. మాటలు లేకుండా, విజువల్స్, mime తో, ముఖ కవళికలు, సంగీతం ద్వారానే కథను చెప్పబోతున్నారు. ఇటీవల విడుదలైన అధికారిక ట్రైలర్‌తో ప్రేక్షకులకు ఈ వినూత్న ప్రయత్నం గురించి ఇంకాస్త తెలిసింది…
రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ రెండు విభిన్న జీవితాలను పరిచయం చేస్తుంది. విజయ్ సేతుపతి ఇందులో మహాదేవ్ అనే పాత్రలో నటించారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, జీవితం అంతా అవమానాలు, కష్టాలతో గడుపుతూ, అనారోగ్యంతో ఉన్న తల్లిని అంకితభావంతో చూసుకుంటూ జీవించే వ్యక్తిగా ఆయన పాత్ర కనిపిస్తుంది. అదే సమయంలో, పొరుగింటి అమ్మాయి అదితి తో మొదలయ్యే ప్రేమ ఎంతో హాయిగా ఉంటుంది…
ఇదే కథలో మరో వైపు అరవింద్ స్వామి పోషించిన బోస్మన్ పాత్ర ఉంది. సంపన్న నిర్మాణ రంగ వ్యాపారవేత్తగా కనిపించే అతడు, డబ్బు ఉన్నా విలువలు లేని వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. ట్రైలర్ ముందుకు సాగేకొద్దీ ఈ ఇద్దరి జీవితాలు ఎలా ఢీకొంటాయో, ఆ సంఘర్షణ ఎలా తీవ్రతరమవుతుందో విజువల్ స్టోరీటెల్లింగ్ ద్వారా చూపించారు.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఏ.ఆర్. రెహమాన్. ట్రైలర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన విజయ్ సేతుపతి, “ప్రతి కథకు మాటలు అవసరం ఉండవు. కొన్ని కథలు అనుభూతిగా మాత్రమే అనుభవించాలి. ఈసారి స్క్రీన్ మాట్లాడదు… అది మనల్ని వినిపిస్తుంది” అని రాసి, సినిమా ఇంపార్టెన్స్ చెప్పారు!
ఇంతకుముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్, ‘గాంధీ టాక్స్’ను “నిశ్శబ్దాన్ని నమ్మే సినిమా ప్రయోగం” గా వర్ణించారు. ఆధునిక సినిమాల్లోని శబ్దాల హడావుడిని తొలగించి, నటన, భావోద్వేగాలు, విజువల్స్ అనే మౌలిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మాటలేమీ లేకుండా ప్రేక్షకులను కదిలించే ప్రయత్నమే ఈ సినిమా అని ఆయన స్పష్టం చేశారు.