ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2026 కేంద్ర బడ్జెట్‌పై ఈసారి జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గ్రహాల కదలికలు, రాశి ప్రభావాల ఆధారంగా చూస్తే ఈ బడ్జెట్ పూర్తిగా సమతుల్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది స్థిరత్వాన్ని అందించే బడ్జెట్‌గా మారవచ్చని భావిస్తున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026 సంవత్సరానికి సూర్యుడు, శని ప్రధాన పాలక గ్రహాలుగా వ్యవహరిస్తున్నాయి. సూర్యుడు పరిపాలనకు, శని న్యాయానికి సంకేతం. ఈ రెండు గ్రహాల ప్రభావంతో ప్రభుత్వ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, నియంత్రణతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో పారిశ్రామిక రంగంలో కొంత ఒడిదుడుకులు కనిపించినా, దీర్ఘకాల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని అంచనా.
బడ్జెట్ రోజున మకర రాశిలో ఏర్పడే చతుర్గ్రహి యోగం వల్ల కొన్ని రంగాలకు ఊపొస్తుంది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగాలు లాభపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి పడే అవకాశం ఉంది. మరోవైపు నిర్మాణ రంగం, ఇనుము, ఉక్కు, పెట్రోకెమికల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి.
సామాన్య ప్రజల దృష్టిలో ఈ బడ్జెట్ పూర్తిగా భారంగా ఉండకపోవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు సాధారణంగానే ఉండే అవకాశం ఉండగా, విలాస వస్తువులు, సౌందర్య సాధనాలు, లగ్జరీ వాహనాలు ఖరీదైనవిగా మారవచ్చని జ్యోతిష్య సంకేతాలు చెబుతున్నాయి. విద్య రంగాన్ని బలోపేతం చేసే కొత్త ప్రణాళికలు రావొచ్చని కూడా అంచనా.
కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండటంతో రక్షణ, సైనిక రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి ఉండటం వల్ల రైతులకు ఉపకరించే నిర్ణయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తంగా గ్రహాల ప్రభావాన్ని పరిశీలిస్తే 2026 కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ, దేశాభివృద్ధికి దోహదపడేలా రూపుదిద్దుకునే అవకాశం ఉందని జ్యోతిష్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.