ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర ప్రారంభమవగానే భక్తుల హృదయాల్లో ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక స్పూర్తి అలముకుంటుంది. సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనానికి దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. బెల్లం, బంగారం సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే మేడారం వెళ్లే ప్రతి భక్తుడు తప్పనిసరిగా పాటించే ఒక సంప్రదాయం ఉంది. అదే… సమ్మక్క–సారలమ్మల దర్శనానికి ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం.
ములుగు జిల్లా మార్గంలో ఉన్న గట్టమ్మ తల్లి ఆలయాన్ని భక్తులు “గేట్ వే ఆఫ్ మేడారం”గా భావిస్తారు. కారణం లేకుండా ఈ సంప్రదాయం ఏర్పడలేదు. గిరిజనుల నమ్మకాల ప్రకారం, మేడారం గిరిజన రాజ్యం కోసం జరిగిన పోరాటంలో సమ్మక్క తల్లికి అంగరక్షకురాలిగా గట్టమ్మ తల్లి అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందింది. అందుకే ఆమెను కేవలం దేవతగా మాత్రమే కాకుండా, వనదేవతల విశ్వాసానికి ప్రతీకగా కొలుస్తారు.

గట్టమ్మ తల్లితో పాటు సురపల్లి సురక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క వంటి అంగరక్షకులు కూడా సమ్మక్క తల్లిని కాపాడుతూ అమరులయ్యారని గిరిజన చరిత్ర చెబుతోంది. శ్రీరామునికి ఆంజనేయుడు ఎలా ఉన్నాడో, శివునికి నంది ఎలా ఉన్నాడో… అదే విధంగా సమ్మక్క–సారలమ్మలకు గట్టమ్మ తల్లి నమ్మిన బంటుగా పూజలందుకుంటోంది.
గట్టమ్మ తల్లి ఆలయంలో పూజలు సంప్రదాయబద్ధంగా నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. పెళ్లి కావాలి, సంతానం కలగాలి, పంటలు బాగుండాలి, ఉద్యోగం రావాలి, ఆరోగ్యం మెరుగుపడాలి వంటి కోరికలతో పాటు కొత్త వాహనాల పూజలు చేయించుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీ. కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని, అనంతరం సమ్మక్క–సారలమ్మల సన్నిధికి బయలుదేరుతారు.
ఈ విశ్వాసమే నేడు ములుగు గట్టమ్మ తల్లి ఆలయాన్ని మరో శక్తిపీఠంగా నిలిపింది. మేడారం జాతర అంటే కేవలం ఉత్సవం మాత్రమే కాదు… అది భక్తి, చరిత్ర, జీవనశైలికి అద్దం పడే మహా సంప్రదాయం.