వివాహం ఆలస్యం అవుతోందని, మంచి సంబంధం కుదరడం లేదని ఆందోళనపడేవారికి ఓ విశేషమైన నమ్మకం ఉంది. ఒక్కసారి హృదయపూర్వకంగా దర్శిస్తే అదృష్టాన్ని ప్రసాదించే ఆలయం అది. అదే… తమిళనాడులోని కాళీపట్టి కందస్వామి ఆలయం. భక్తి, విశ్వాసం, జీవనశైలిని మేళవించిన ఈ ఆలయం నేడు అవివాహితుల ఆశల దీపంగా మారింది.
భారతదేశంలో ఆలయాల రాష్ట్రంగా పేరొందిన తమిళనాడులో శివ–విష్ణు ఆలయాలతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. మురుగన్‌ను కందస్వామిగా పిలుచుకుంటూ భక్తులు అపార భక్తితో కొలుస్తారు. అలాంటి మహిమాన్విత క్షేత్రాల్లో కాళీపట్టి కందస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం సేలం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, నామక్కల్–తిరుచెంగోడే మార్గంలో కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో వెలసి ఉంది. సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం మురుగభక్తుడు లక్ష్మణ్ గౌండర్ స్వామి ఆజ్ఞతో ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది.

ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపునిచ్చేది నల్లరంగు తిరునీర్ ప్రసాదం. చెరుకు పొట్టును కాల్చి వచ్చిన బూడిదతో, కఠిన ఉపవాసాలతో శుద్ధి చేసిన తర్వాత ఈ తిరునీర్ తయారు చేస్తారు. దీన్ని భక్తితో స్వీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని విశ్వాసం. అందుకే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
పళని వెళ్లలేని భక్తులకు ఈ ఆలయం ప్రత్యామ్నాయ దర్శనంగా భావిస్తారు. ఇక్కడ కందస్వామిని దర్శిస్తే పళని మురుగన్ దర్శన ఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది. ఆలయానికి ఎదురుగా లక్ష్మణ్ గౌండర్ సమాధి కూడా దర్శనీయంగా ఉంటుంది.
ప్రతి మంగళవారం జరిగే దీపోత్సవం ఆధ్యాత్మిక కాంతితో ఆలయాన్ని వెలిగిస్తుంది. ముఖ్యంగా తైపూసం పండుగ సమయంలో జరిగే పశువుల సంత దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. మంగళవారం దీపోత్సవంలో అవివాహితులు దీపం వెలిగించి ప్రార్థిస్తే త్వరగా వివాహయోగం కలుగుతుందని, మంచి జీవన భాగస్వామి లభిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయం నేడు భక్తి మాత్రమే కాదు… ఆశ, విశ్వాసం, జీవితానికి దారి చూపే శక్తిపీఠంగా నిలుస్తోంది.