వేసవిలో నాటుకోడి ఫామ్‌…చక్కగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి

Hatching Country Chicken Eggs in Summer

వేసవి కాలంలో నాటుకోడి గుడ్లను పొదిగించి, అధిక సంఖ్యలో ఆరోగ్యకరమైన పిల్లలను పొందడం ఒక కళ. సాధారణంగా ఎండ వేడిమికి గుడ్లు పాడవుతాయని భయపడతాం, కానీ కొన్ని పక్కా జాగ్రత్తలు తీసుకుంటే 100 శాతం ఫలితాలు సాధించవచ్చు. మొదటిగా, వేసవిలో కోడి కింద గడ్డికి బదులు ‘ఇసుక’ వాడటం అతి ముఖ్యమైన చిట్కా. ఇసుక చల్లదనాన్ని ఇస్తుంది, దీనివల్ల కోడి అలసట చెందకుండా ఉంటుంది. పొదిగే చోట వేపాకులు వేస్తే కోడి పేల సమస్య ఉండదు. చాలామందికి ఉన్న పెద్ద సందేహం.. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్లు పిల్లలు అవుతాయా? అని. ఖచ్చితంగా అవుతాయి! అయితే, గుడ్లను ఫ్రిజ్ డోర్‌లో కాకుండా లోపల ట్రేలో భద్రపరచాలి. పొదిగించడానికి 24 గంటల ముందే వాటిని బయట తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చేలా చూడాలి. మరొక కీలక విషయం ఏమిటంటే, గుడ్లు మంచివో కాదో తెలుసుకోవడానికి ఎప్పుడూ నీటిలో వేయకూడదు; అలా చేస్తే పెంకుపై ఉండే సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోయి పిల్లలు చనిపోతాయి.

పొదిగించే కోడి ఎంపికలో కూడా మెళకువలు ఉన్నాయి. మరీ బరువున్న కోడిని కాకుండా, తక్కువ బరువున్న ‘పూరి పెట్ట’ను ఎంచుకుంటే గుడ్లు నలిగిపోకుండా ఉంటాయి. కోడి రెక్కల పరిమాణాన్ని బట్టి 13 నుండి 15 గుడ్లు వేయడం ఉత్తమం. వేసవిలో కోడిని రోజుకు 30 నిమిషాల పాటు బయటకు తీసి దాణా, నీళ్లు అందించాలి. దీనివల్ల కోడికి ఎండ వేడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా, గుడ్ల ఉష్ణోగ్రత కూడా సమతుల్యంగా ఉంటుంది. బ్రీడర్ కోడికి మంచి కాల్షియం ఉన్న దాణా ఇస్తే పిల్లలు బలంగా పుడతాయి. ఈ చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే, భానుడి భగభగల్లోనూ మీ నాటుకోడి ఫామ్ పిల్లలతో కళకళలాడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *