ఇరాన్‌ అమెరికా డీల్‌ రెడీ… 300 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్టిమెంట్‌తో పక్కా ప్లాన్‌

US Iran Peace Deal 2026

US Iran Peace Deal 2026: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్‌ మధ్య కీలక ఒప్పందం దాదాపు సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణతో పాటు ఇరాన్‌ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించేందుకు రెండు దేశాలు అవగాహన ఒప్పందం (MoU)పై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశంగా 300 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక నిలుస్తోంది. తుది ఒప్పందం కుదిరితే ఇరాన్‌లో పునర్నిర్మాణం, చమురు, ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా సహకరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అమెరికన్‌ కంపెనీలకు ఇరాన్‌లో పెట్టుబడుల మార్గం కూడా తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది.

అలాగే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్‌ జలసంధిలో నౌకా రాకపోకలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడంపై కూడా చర్చలు జరిగాయి. ఇరాన్‌ తన సముద్ర గనులను 30 రోజుల్లో తొలగిస్తే అమెరికా నౌకాదళ ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయొచ్చని సమాచారం.

ఇక ఇరాన్‌ వద్ద ఉన్న సుమారు 970 పౌండ్ల అధిక స్థాయి యురేనియం నిల్వల భవితవ్యంపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. అమెరికా ఆంక్షల సడలింపు, విదేశీ బ్యాంకుల్లో నిల్వ ఉన్న ఇరాన్‌కు చెందిన సుమారు 24 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదల అంశాలు కూడా ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.

అయితే ఈ ఒప్పందంపై ఇంకా తుది అంగీకారం రాలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ వర్గాలు కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఒప్పందం పూర్తయిందని చెప్పలేమని వెల్లడించాయి.

Also Read  ఆ దేశంలో బట్టతలకు ఇన్సూరెన్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *